నటీనటులు: ఆది సాయి కుమార్, శ్రద్దా శ్రీనాధ్, వెన్నెల కిషోర్, గొల్లపూడి మారుతీ రావు, సత్య తదితరులు
దర్శకత్వం: విశ్వనాధ్ అరిగెల
నిర్మాణం: సాయి వెంకటేష్ గుర్రం, పద్మజ
సంగీతం: ఫణి కళ్యాణ్
సినిమాటోగ్రఫర్: విశ్వేశ్వర్ ఎస్వీ
విడుదల తేదీ: సెప్టెంబరు 06, 2019.
రేటింగ్: 2/5
తెరపై కనిపించే ప్రతి సన్నివేశానికీ ఓ లక్ష్యం ఉంటుంది. కథ చెప్పడమో లేదంటే నవ్వించడమో, భావోద్వేగాలు పండించడమో... ఇలా ప్రతి సన్నివేశం ఏదో ఓ బాధ్యతని నిర్వర్తిస్తున్నప్పుడే ఏ ప్రేక్షకుడైనా సీట్లో కాసేపు కూర్చుంటాడు.
అలా కాకుండా వచ్చిన సన్నివేశాలన్నీ ప్రేక్షకుడిపై ఎలాంటి ప్రభావం చూపించకుండా ముందుకు సాగిపోతూ ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి సన్నివేశాలతోనే ముస్తాబై ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే `జోడీ`. సుదీర్ఘంగా సాగే ఈ జోడీ కథేమిటో చూద్దాం...
* కథ
కమలాకర్ (నరేష్) ఓ ప్రభుత్వోద్యోగి. క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే తన కొడుక్కి కపిల్ (ఆది సాయికుమార్) అని పేరు పెడతాడు. క్రికెట్ బెట్టింగ్‌కి బానిసైన కమలాకర్ తన ఉద్యోగాన్ని కోల్పోవడంతో పాటు, ఆస్తినంతా పోగొట్టుకుంటాడు. ఉద్యోగం చేస్తున్న కొడుకు కపిల్ దగ్గర రోజూ డబ్బు తీసుకుంటూ జూదం ఆడుతుంటాడు. తన తండ్రి అంటే ఇష్టం కావడంతో కపిల్ కూడా కాదనకుండా డబ్బు సమకూరుస్తుంటాడు. ఫ్రెంచి భాష నేర్పించే టీచర్ కాంచన మాల (శ్రద్ధాశ్రీనాథ్)ని చూసి ప్రేమలో పడతాడు కపిల్.
ఆమె కూడా ఇష్టపడుతుంది. తల్లిదండ్రులు లేని కాంచనమాల తాను కపిల్‌ని ప్రేమిస్తున్న విషయాన్ని బాబాయ్ రాజు (సిజ్జు)కి చెబుతుంది. ఆయన ఆ ప్రేమని తిరస్కరిస్తాడు. కారణం కాంచనమాల తండ్రి మరణించడానికి కారణం కపిల్ తండ్రి కమలాకర్ కావడమే. అసలు కాంచనమాల తండ్రి ఎవరు? ఆయన చనిపోవడానికి కమలాకర్ కారణం ఎలా అయ్యారు? మరి ప్రేమజంట ఒక్కటైందా లేదా? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
* నటీనటులు
ఆది లవర్‌బాయ్‌లాఅలవాటైన పద్ధతిలో నటిస్తూ వెళ్లిపోయాడు. శ్రద్ధౄ శ్రీనాథ్‌కి నటించే అవకాశం దక్కలేదు. ఆమె అందంగా కనిపించిందంతే. నరేష్, గొల్లపూడి, సిజ్జు, సితార వంటి నటులున్నా భావోద్వేగాలు రాబట్టుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు.
వాళ్లు పాత్రల పరిధి మేరకు నటించారు. వెన్నెలకిషోర్, సత్య నవ్వించే ప్రయత్నం చేశారు. రియల్ ఎస్టేట్ ఎపిసోడ్ కాస్త నవ్విస్తుందంతే. మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవల్సిందేమీ లేదు.
* సాంకేతిక వర్గం
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. కెమెరా పనితనం, నేపథ్య సంగీతం బాగుంది. పాటలు మాత్రం పాడుకునేలా లేవు. ఎడిటింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకోవల్సింది. దర్శకుడు కథ, కథనాల్ని రాసుకోవడంలోనే కాకుండా... వాటిని తెరపైకి తీసుకొచ్చిన విధానంలోనూ విఫలమయ్యారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మాటల్లో అక్కడక్కడా మెరుపు కనిపిస్తుంది.
* విశ్లేషణ
ప్రేమలో పడిన ఒక జంట తమకి ఎదురైన సమస్యలన్నింటినీ అధిగమించి పెళ్లి పీటలెక్కడమే ఈ కథ. ప్రేమకథలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. వాటిని తెరకెక్కించడంలోనే కొత్తదనం చూపాలి. వాళ్లకి ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించే తీరు, ప్రేమజంట మధ్య పండే కెమిస్ట్రీలోనే ఉంటుంది విజయరహస్యం. ట్రెండ్‌కి తగ్గట్టుగా సన్నివేశాల్ని అల్లుకోవాలి. అలా కాకుండా, పాత కథని... అదే మూసధోరణిలో తెరపైకి తీసుకొస్తామంటే ప్రేక్షకుడికి ఏమాత్రం మింగుడుపడదు.
అలాంటి తానుకి చెందిన ముక్కే `జోడీ` కూడా. అరిగిపోయిన కథకి తోడు, ఏమాత్రం కొత్తదనం లేని కథనంతో సినిమాని తీర్చిదిద్దారు. ప్రేమజంట మధ్య కెమిస్ట్రీ అయినా పండిందా అంటే అదీ లేదు. సన్నివేశాల్లోనే బలం లేనప్పుడు ఏ భావోద్వేగమూ పండదనే విషయాన్ని ఈ సినిమా అడుగడుగునా చాటి చెబుతుంటుంది. ఆరంభంలోనే కథ ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్లిపోతుంది. నాయకానాయికల మధ్య ప్రేమకథ మొదలవుతుంది. ఆ ప్రేమకథలో ఏమాత్రం కొత్తదనం లేదు. నాయకానాయికలు ఆకర్షణకి గురికావడానికి, వాళ్ల మధ్య ప్రేమ చిగురించచడానికి బలమైన కారణాలేమీ కనిపించవు. ఒక జోడీ ఉంది కాబట్టి, వారిద్దరూ ప్రేమలో పడాలి కాబట్టి సన్నివేశాలు అన్నట్టుగా కథ సాగుతుంటుంది.
మరోపక్క కుటుంబ కథని కూడా అంతే ప్రభావితంగా చెప్పే ఆస్కారమున్నా ప్రథమార్థం పూర్తయ్యేవరకు అటువైపు దృష్టిపెట్టలేదు. ద్వితీయార్థంలోనైనా కుటుంబ నేపథ్యాన్ని బలంగా వాడుకొన్నారా అంటే అదీ లేదు. ఇవి చాలవన్నట్టుగా మధ్యలో విలన్ ఎపిసోడ్ ఒకటి. రెండు మూడు పార్శ్శాల్లో కథని నడపాలని అనుకోవడం బాగుంది కానీ... వాటిని సరిగ్గా మేళవించి వినోదాన్ని రాబట్టడంలోనే అసలు పనితనం ఉంటుంది. బెట్టింగ్ నేపథ్యంలో కుటుంబ కథని రాసుకోవడం వరకు కొత్తదనం ఉంది కానీ.. మిగతా సన్నివేశాల్లో ఏమాత్రం పసలేదు. పతాక సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి.
* ప్లస్ పాయింట్స్
అక్కడక్కడా వినోదం.. భావోద్వేగాలు
బెట్టింగ్ నేపథ్యం
* మైనస్ పాయింట్స్
పాత కథ
సాగదీతగా సన్నివేశాలు
* ఫైనల్ వర్డిక్ట్: బోరింగ్ `జోడీ`
- రివ్యూ రాసింది శ్రీ