బాహుబలి, రాబో లాంటి చిత్రాలలో యాక్షన్ సీన్లు అంత గొప్పగా రావడానికి కారణం... పీటర్ హెయిన్స్. తాను కంపోజ్ చేసిన పోరాటాలు చాలా రిచ్‌గా, కొత్తగా కనిపిస్తుంటాయి. దేశంలో అత్యధిక పారితోషికం అందుకునే ఫైట్ మాస్టర్లలో తనొకడు. ఎప్పటి నుంచో డైరెక్షన్ చేయాలని వుందంటూ తన మనసులో మాట చెబుతుండేవాడు. ఎట్టకేలకు అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది.
నల్లమలపు బుజ్జి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. ఫైట్ మాస్టర్ దర్శకత్వం అంటే అదేదో యాక్షన్ సినిమా అనుకోవడం పొరపాటే. పీటర్ తన తొలి ప్రయత్నంగా ఓ వినూత్నమైన ప్రేమకథని చెప్పబోతున్నాడట. యాక్షన్ బదులుగా ఈ సినిమాలో రొమాన్స్ పుష్కలంగా ఉంటుందని తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితమే పీటర్ ఈ కథని తయారు చేసుకున్నాడని సమాచారం.
కాకపోతే ఈసినిమా రిచ్‌గా, మేకింగ్‌పరంగా మరో స్థాయిలో ఉండబోతోందట. యాక్షన్ కొరియోగ్రఫీకి ఈమధ్య కొంత విరామం ఇచ్చిన పీటర్... ఈలోగా దర్శకత్వ పాఠాలు నేర్చుకున్నాడు. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టిన పీటర్... తన మనసులోని ప్రేమ కథని ఏ రేంజ్ లో చూపిస్తాడో మరి.