నటీనటులు: సంపూర్ణేష్ బాబు,ఇషికా సింగ్,గీతాంజలి,గాయత్రి గుప్తా తదితరులు
దర్శకత్వం: రూపక్ రొనాల్డ్ సన్
నిర్మాణం : సాయి రాజేష్ నీలం.
సంగీతం: సయీద్ కమ్రాన్
సినిమాటోగ్రఫర్: ముజీర్ మాలిక్
విడుదల తేదీ: ఆగస్టు 10, 2019
రేటింగ్: 2.25/5
వినోదం ఇప్పుడు చాలా చీప్ అయిపోయింది. టీవీ ఆన్ చేసినా, ఫేస్ బుక్ తెరిచినా, వాట్సాప్ చూసినా.. ఎక్కడైనా సరే.. కామెడీ టచ్ కనిపిస్తోంది. సోషల్ మీడియా ప్రభావం వల్ల.. అవి పూర్తిగా అందుబాటులోకి వచ్చేయడం వల్ల - కామెడీ ఏరులై పారుతోంది. వాటితోనే బోలెడంత కాలక్షేపం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించి, నవ్వించడం చాలా కష్టమైపోతోంది.
కామెడీ కోసం టికెట్టు తెంచేలా చేయడం గగనం అయిపోతోంది. అందుకే కామెడీ సినిమాలకు కష్టకాలం ఎదురైంది. నరేష్, సునీల్ లాంటివాళ్లే సైడ్ అయిపోయారు. ఒకరో ఇద్దరో ఈ జోనర్ పట్టుకుని ఈదుతున్నారు. `హృదయకాలేయం`తో ఒక్కసారి జర్క్ ఇచ్చిన సంపూని చూసి కామెడీ సినిమాలు తీయాలి అనే బ్యాచ్ ఒకటి బయల్దేరింది. అందులో భాగంగా వచ్చిన సినిమానే `కొబ్బరి మట్ట`.
* కథ
పెదరాయుడు (సంపూర్ణేష్‌బాబు) ఊరికి పెద్ద దిక్కు. పెదరాయుడులో మోహన్ బాబులా ఊర్లో ఏ చిన్న తప్పు జరిగినా, పెద్ద మనిషిలా వ్యవహరిస్తూ తీర్పులు చెబుతుంటాడు. తనకు ముగ్గురు తమ్ముళ్లు. ముగ్గురు పెళ్లాలు. చాలా పెద్ద కుటుంబం.
ఈ కుటుంబంలోకి ఆండ్రాయుడు (సంపూ) అడుగుపెడతాడు. `నా నాన్నవు నువ్వే` అంటూ పెదరాయుడు పాతివ్యత్యాన్ని శంకిస్తాడు. ఇంతకీ ఆండ్రాయుడు ఎవరు? పెదరాయుడు ఆండ్రాయుడికి నాన్న ఎలా అయ్యాడు? వీళ్ల ఫ్లాష్ బ్యాకులూ, ఫ్రంట్ ఫ్లాషులూ ఏమిటి? అనేదే `కొబ్బరి మట్ట` కథ.
* నటీనటులు
సంపూ వన్ మ్యాన్ షో చేశాడు. సంపూని ఇష్టపడేవాళ్లకు, సంపూ అంటే ఇంతేగా అనుకునే వాళ్లకూ.. గ్యారెంటీగా సంపూ మరోసారి నచ్చుతాడు. కొన్నిస్టెప్పులు, కొన్ని డైలాగులు ఆశ్చర్యపరుస్తాయి. సంపూ ఎంత చేసినా ఓ హీరోలా చూడలేం. ఓ కమెడియన్ మాత్రమే.
సంపూ హీరో ఏంట్రా అనుకుంటే మాత్రం ఈ సినిమాలో ఏ సీన్ ప్రేక్షకుల్ని మెప్పించదు. సంపూని కేవలం కామెడీ యాంగిల్‌లో చూస్తే మాత్రం భరించొచ్చు. సంపూ మినహాయిస్తే మిగిలివాళ్లెవ్వరికీ పెద్దగా పని లేకుండా పోయింది. సంపూ తమ్ముళ్లుగా నటించినవాళ్లు కాస్త మెప్పించగలిగారంతే.
* సాంకేతిక వర్గం
ఇదో చిన్న సినిమా. భారీ హంగులు, ఆర్భాటాలూ ఆశించలేం. ఉన్నంతలో షార్ట్ ఫిల్మ్‌కి మించేలానే తీశారు. మాటల్లో పంచ్‌లు, ప్రాసలు బాగా పేలాయి. కొన్ని రోజుల పాటు అవన్నీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తాయి. సంపూని ఓ కామెడీ పీస్ లా చూసేవాళ్లకు కొబ్బరిమట్ట కూడా ఓకే అనిపిస్తుంది. కానీ.. హృదయకాలేయంలా మరోసారి టీవీలో వచ్చినప్పుడు కూడా చూసి నవ్వుకుందాం అనుకుంటే మాత్రం కుదరదు.
* విశ్లేషణ
సంపూ కథలో లాజిక్కులు వెదుక్కోవడం అనవసరం. ఎలాంటి లాజిక్కులూ వేసుకోకుండా హృదయకాలేయం తీశారు. అప్పట్లో మా మ్యాజిక్ బాగా వర్కవుట్ అయ్యింది. థియేటర్లకు వెళ్లి ఆ సినిమాని జనాలు చూడకపోయినా.. సోషల్ మీడియాలో వచ్చిన ప్రమోషన్ వల్ల ఆ సినిమా జనాల్లోకి వెళ్లింది. సంపూ చేసే ప్రతీ పనీ కామెడీగా అనిపించడంతో... జనాలూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే మ్యాజిక్‌ని నమ్ముకోవడం అవివేకం. అర్థ రహితం. సింహం పిల్లిలా అరవడం తొలిసారి విన్నప్పుడు బాగుంటుంది.
రెండోసారీ అదే చూపిస్తానంటే రోత పుడుతుంది. సరిగ్గా.. కొబ్బరి మట్ట విషయంలో అదే జరిగింది. ఏమాత్రం లాజిక్కులు వేసుకోకుండా..కేవలం సెటైరికల్ కామెడీని నమ్ముకుని తీసిన సినిమా ఇది. గత తెలుగు చిత్రాలకు ఇదేదో స్నూఫ్‌లా అనిపిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇలాంటి ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. సుడిగాడులో ఏకంగా అరవై సీన్లు స్నూఫ్‌లుగా తీశారు. కమర్షియల్ సినిమాల్లో కామెడీ కోసం కొన్ని సీన్లు పేరడీ చేశారు. కొబ్బరి మట్ట కూడా పేరడీ గారడీనే. కొబ్బరి మట్టలోని ప్రతీ సన్నివేశం...ఏదో ఓ సన్నివేశానికి పేరడీగా అనిపిస్తుంటుంది.
కొన్నిసార్లు ఆ కామెడీ వర్కవుట్ అయ్యింది. చాలాసార్లు కాలేదు. కామెడీ కోసం దర్శకుడు, రచయిత ఎంత దూరం వెళ్లాలో అంత దూరం వెళ్లారు. సెటైరికల్ డైలాగులు రాసుకున్నారు. అవి అర్థమైన వాళ్లు కొంత వరకూ వినోదాన్ని పిండుకునే ప్రయత్నం చేస్తారు. మిగిలినవాళ్లకు మాత్రం ఇదంతా ఓ ప్రహసనంలా అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరిగింది? అలా ఎందుకు జరిగింది? అని ఆరా తీయడం అర్థం లేని పని. తెరపై సంపూ విన్యాసాలు చూస్తూ... కాలక్షేపం చేయడానికి రెడీ అయితే.. కొబ్బరిమట్ట పాస్ అయిపోతుంది. ఈ కామెడీ ఏదో జబర్‌దస్త్‌లో దొరికేస్తుంది కదా అనుకుంటే మాత్రం కష్టమైపోతుంది.
* ప్లస్ పాయింట్స్
సంపూ
వినోదం
* మైనస్ పాయింట్స్
విసుగుతెప్పించే సీన్లు
ఓవరాక్షన్
* ఫైనల్ వర్డిక్ట్: కొబ్బరి ఆకులు లేని.. కొబ్బరి మట్ట కథ.
- రివ్యూ రాసింది శ్రీ