తారాగణం: అఖిల్, నిధి అగర్వాల్, నాగబాబు, వి జయప్రకాష్, సితార తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
సంగీతం: ఎస్.ఎస్.తమన్
ఎడిటర్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విల్లియమ్స్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్
దర్శకత్వం: వెంకీ అట్లూరి
విడుదల: 25 జనవరి 2019
రేటింగ్: 2.75/5
ప్రేమకథకు కావాల్సింది
కెమిస్ట్రీనో, కాకరకాయో కాదు.
ఎమోషన్.
ఓ అబ్బాయిని, అమ్మాయినీ చూస్తే.. వీళ్లెప్పుడు ఐ లవ్ యూ చెప్పుకుంటారా అని ఎదురుచూడాలి. వాళ్లు విడిపోతే.. మళ్లీ ఎప్పుడు కలుసుకుంటారా అని కలలు కనాలి. అదే.. ఎమోషన్ చేసే మ్యాజిక్. అది పండితే... ప్రతీ ప్రేమకథా ఓ మజ్నులా తయారవుతుంది. లేదంటే మిస్టర్ మజ్ను అవుతుంది.
ఈ ఉపోద్ఘాతమంతా... అక్కినేని అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను గురించే. దర్శకుడిగా వెంకీ అట్లూరి రెండో ప్రయత్నం ఇది. మొదటి సారి `తొలి ప్రేమ`తో ఎమోషన్ రుచి చూసిన వెంకీ అట్లూరి.. రెండో ప్రయత్నానికి వచ్చేసరికి ఆ ఎమోషన్‌ని మర్చిపోయి మిగిలిన బిల్డప్పులవైపు ఆధారపడ్డాడు. అందుకే... తొలి ప్రేమ ఇచ్చిన ఫీల్... మజ్నులో మిస్ అయ్యింది. దాన్ని ఇంకాస్త డిటైల్డ్‌గా చెప్పుకుంటే..
కథ
విక్కీ (అఖిల్) ఓ ప్లే బాయ్. మాయ చేసి, అందమైన అబద్ధాలు చెప్పి అమ్మాయిల్ని తన వైపుకు తిప్పుకుంటాడు. నెలరోజుల్లో బ్రేకప్ చెప్పేస్తాడు. నిక్కీ (నిధి అగర్వాల్)ని కూడా అలానే తన బుట్టలో పడేద్దామనుకుంటాడు. కానీ.. నిక్కీ ఆ రకం కాదు. తనకు కాబోయే భర్త శ్రీరాముడిలా ఉంటాలనుకుంటుంది. కానీ పరిస్థితుల ప్రభావంతో... విక్కీని ఇష్టపడుతుంది. విక్కీకి మాత్రం ప్రేమలూ.. దోమలు అస్సలు పడవు. అతనివన్నీ చిలిపి ఆటలే.
'రెండు నెలలు ట్రై చేద్దాం. ఒకరిపై మరొకరికి ప్రేమ పుడితే కంటిన్యూ చేద్దాం' అనే షరతుపై ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ... నిక్కీ చూపించే అతిప్రేమని విక్కీ భరించలేడు. రెండు నెలలూ రెండు యుగాలుగా గడుస్తాయి. `నీతో జీవితాంతం గడపడం కష్టం` అని చేతులెత్తేస్తాడు. ఆ తరవాత ఏమైంది? విక్కీకి నిక్కీపై ప్రేమ పుట్టిందా, లేదా? వీరిద్దరూ మళ్లీ ఎప్పుడు ఎలా కలుసుకున్నారు? అనేదే మిస్టర్ మజ్ను కథ.
నటీనటుల పనితీరు..
తొలి రెండు సినిమాల్లోని లోపాల్ని అఖిల్ కాస్త సరిదిద్దుకున్నట్టే అనిపిస్తుంది. తెరపై అందంగా కనిపించాడు. మజ్ను అనే పదానికి న్యాయం చేశాడు. అయితే ఎమోషన్ సీన్స్ దగ్గరకు వచ్చేసరికి మామూలుగానే ఇబ్బంది పడిపోతున్నాడు. డైలాగ్ డిక్షన్ మెరుగైనా, ఇంకాస్త సరిదిద్దుకోవాల్సివుంది. నిధి అగర్వాల్ కొన్నిసార్లు అందంగా, ఇంకొన్నిసార్లు `ఈ అమ్మాయి హీరోయిన్ ఏంటి` అనుకునేలా కనిపించింది. నాగబాబు, జయ ప్రకాష్, రావు రమేష్, అజయ్, సుబ్బరాజు.. ఇలా కాస్టింగ్ స్ట్రాంగ్‌గానే ఉంది. ప్రియదర్శి కంటే హైపర్ ఆదినే కాస్త నవ్వించగలిగాడు.
విశ్లేషణ...
కథాపరంగా వెంకీ నుంచి అద్భుతాలేం ఆశించలేం. తొలి ప్రేమ కూడా రొటీన్ కథనే ఎంచుకున్నాడు. కానీ...ఎమోషన్ పరంగా వర్కవుట్ అయ్యింది. `మిస్టర్ మజ్ను` కూడా రొటీన్ కథే. ఇది వరకు మనం చూసిన చాలా సినిమాలు కళ్లముందు మెదులుతాయి. ఇక్కడా ఎమోషన్ వర్కవుట్ అయితే.. అఖిల్‌కి తొలి హిట్టు పడేదేమో. కానీ.. కథనంలో లోపాలవల్ల.. అంత అదృష్టం లేకుండా పోయింది. అఖిల్ పాత్రని పరిచయం చేయడం, అతన్నో ప్లేబాయ్‌గా మార్చడం, నిధితో పరిచయం, కాకతాళియంగా ఇద్దరూ చుట్టాలు కావడం.. ఇదంతా బాగుంది.
టేకాఫ్ సాఫీగానే సాగిపోతున్నట్టు అనిపిస్తుంది. చెల్లాయి పెళ్లి దగ్గర నుంచి... కథనం ట్రాక్ తప్పింది. అఖిల్‌లోని మంచివాడ్ని ఎలివేట్ చేయడానికి దర్శకుడు చాలా సీన్లు వాడుకున్నాడు. అజయ్‌తో సీన్ అయితే దాదాపు 20 నిమిషాలు సాగి... ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. దర్శకుడు తాను మనసులో అనుకున్నదంతా రాసేసుకుని, రాసుకున్నదంతా తీసేయడానికి తపించిపోయాడు. అందుకే సన్నివేశాలు సుదీర్ఘంగా సాగుతుంటాయి. ఇంట్రవెల్ వచ్చేసరికే ఓ పూర్తి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
ప్రేమకథలో సంఘర్షణ చాలా అవసరం. అయితే అది కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నట్టు అనిపించకూడదు. మిస్టర్ మజ్నులో మాత్రం ఆ ఫీలింగ్ వస్తుంది. నిక్కీ ని వెదుక్కుంటూ లండన్ వెళ్లి, `ఐలవ్ యూ` చెబితే.. విక్కీని రిజెక్ట్ చేయడానికి పెద్ద కారణాలేం కనిపించవు. చివరికి వీళ్లిద్దరూ కలవడానికి కూడా అంతే. `నా కోసం ఏడ్చాడా?` అనే ఒకే ఒక్క పాయింట్ కి హీరోయిన్ పడిపోతుంది. పరిగెట్టుకుంటూ ఎయిర్ పోర్టుకి వస్తుంది. సెకండాఫ్ అంతా కాలక్షేపమే. అయితే... వినోదం పండి, పాటలు బాగుండి, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయితే బాగుండేది. ఇవేం జరక్కపోయే సరికి... తొలిసగం లో వచ్చిన కాస్త ఇంప్రెషన్ కూడా టక్కున పడిపోతుంది.
సాంకేతిక వర్గం...
తమన్ పాటలు, ఆర్.ఆర్ బాగున్నాయి. డైనింగ్ టేబుల్ దగ్గర సీన్లో తమన్ ఆర్.ఆర్ కొత్తగా వినిపించింది. ఫొటోగ్రఫీ క్లాస్ అనుకోవాలంతే. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. వెంకీ అట్లూరి రెండో సినిమాకి వచ్చేసరికే.. రిలాక్స్ అయిపోయాడు. బలమైన కథ రాసుకోలేదు సరికదా, భావోద్వేగాలు బలంగా పండించడంలోనూ విఫలమయ్యాడు. అక్కడక్కడ కొన్ని మెరుపులు మినహాయిస్తే.. మజ్ను ఎలాంటి సంతృప్తీ ఇవ్వదు.
* ప్లస్ పాయింట్స్
+ అఖిల్
+ సంగీతం
+ ప్రొడక్షన్ వాల్యూస్
* మైనస్ పాయింట్స్
- కథ
- సంఘర్షణ లేకపోవడం
పైనల్ వర్డిక్ట్: మజ్ను... పాత కథే
రివ్యూ రాసింది శ్రీ.