'ఎఫ్ 2' మినహాయిస్తే ఈ యేడాది మరో విజయాన్ని చూడలేకపోయింది టాలీవుడ్. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన '118' కాస్త ఫర్వాలేదనిపించింది. పాజిటీవ్ రివ్యూలతో, మంచి వసూళ్లతో మొదలైన '118' ప్రయాణం మధ్యలో నీరసించింది. వసూళ్లు లేక డీలా పడింది. అయినా సరే - బాక్సాఫీసు దగ్గర మరో సినిమా లేకపోవడంతో కాస్తో కూస్తో వసూళ్లని దక్కించుకుంటోంది. 17 రోజుల ప్రయాణంలో '118' సినిమా పది కోట్ల షేర్ అందుకుంది.
నైజాంలో 3.8 కోట్లు సాధించిన ఈ చిత్రం, సీడెడ్‌లో 1.20 కోట్లు తెచ్చుకుంది. ఓవర్సీస్‌లో మాత్రం ఈ చిత్రానికి దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పటి వరకూ అక్కడ కనీసం 50 లక్షలు కూడా తెచ్చుకోలేకపోయింది. క్లాస్ థ్రిల్లర్‌గా ముద్ర పడిన ఇలాంటి చిత్రాలు ఓవర్సీస్‌లో బాగా ఆడతాయి. కానీ... దురదృష్టం కొద్దీ అక్కడి ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. పరీక్షల సీజన్ కావడం, తెలుగు ప్రజల దృష్టి సినిమాల నుంచి రాజకీయాలవైపు మళ్లడం... రాబోతున్న సినిమాలపై ప్రభావం చూపిస్తున్నాయి. '118' సినిమా టాక్ బాగున్నా వసూళ్లు డల్‌గా ఉండడానికి ఇది కూడా ఓ ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు.