ప్రతీ ఎన్నికలలోనూ సినిమా గ్లామర్ తప్పనిసరి. కథానాయకులు, నాయికలు, మాజీ హీరోయిన్లు, కమెడియన్లు, ఫేడవుట్ అయినవాళ్లూ, కొత్తగా అడుగుపెడుతున్నవాళ్లూ... రాజకీయాల్లోనూ తమ అదృష్టం పరీక్షించుకుందామని తాపత్రయపడుతుంటారు. ఎన్నికల ముందు ఏదో ఓ పార్టీ కండువా కప్పుకోవడం, మైకు ఇస్తే.. సినిమాటిక్ ఉపన్యాసాలు ఇవ్వడం, సీటు ఇస్తే పోటీ చేయడం, ఓడిపోతే - మళ్లీ సినిమాలకే పరిమితం అవ్వడం చూస్తూనే ఉన్నాం. రాబోయే ఎన్నికలలోనూ సినీ గ్లామర్ కనిపించనుంది.
కొంతమంది మాజీ హీరోయిన్లు ఈసారి ఎన్నికలలో హవా చూపించబోతున్నారు. రోజా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. వైకాపా తరపున ఆమె ప్రచారం చేస్తున్నారు. నగరి నియోజక వర్గం నుంచి మరోసారి అసెంబ్లీకి ఆమె పోటీ చేస్తున్నారు. ఒకప్పటి గ్లామర్ తార వాణీ విశ్వనాథ్ టీడీపీ పార్టీలో చేరారు. ఈసారి ఆమెకు టికెట్ లభించకపోయినా.... ప్రచారం చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇటీవలే... దివ్యవాణి కూడా `జై తెలుగుదేశం` అంటూ ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. ఆమె కూడా ప్రచారంలో భాగం కానున్నారు.
వైకాపా నుంచి ప్రచారం చేస్తున్న మరో నటీమణి జయసుధ. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఓ పర్యాయం సేవలు అందించిన జయసుధ. ఈసారి మాత్రం ప్రచారానికి పరిమితమయ్యారు. గుంటూరు (వెస్ట్) నుంచి బీజేపీ తరపున మాధవీలత పోటీ చేస్తోంది. ఆమె ప్రచారం కూడా మొదలెట్టేసింది. ఇలా ఈసారి కథానాయికల హంగామా ఎక్కువగానే కనిపించబోతోంది. హాస్యనటులు జాబితాలో అలీ, ఫృథ్వీ, హైపర్ ఆదీ, పోసారి కృష్ణమురళి, షకలక శంకర్ వివిధ పార్టీల తరపున ప్రచారం చేస్తున్నారు. అయితే వీళ్లెవ్వరికీ ఈసారి సీటు లభించలేదు.