కరోనా బారీన పడి 2020 కొట్టుకెళ్లిపోయింది. టాలీవుడ్ కి భారీ నష్టాలు వాటిల్లాయి. థియేటర్లో బొమ్మ పడలేదు. డిసెంబరులో కాస్త ఊపు వచ్చినా ... అది సరిపోలేదు. దాంతో.. ఆశలన్నీ 2021పైనే. దానికి తగ్గట్టుగానే ఈ సంక్రాంతికి 4 సినిమాలు ముస్తాబయ్యాయి. వీటిలో కనీసం రెండైనా హిట్లు కొడితే.. పూర్వ వైభవం వస్తుందన్న తరుణంలో `క్రాక్` సినిమా విడుదలైంది. సంక్రాంతికి బోణీ కొట్టిన సినిమా ఇది. విడుదల విషయంలో సందిగ్థం నెలకుని, మార్నింగ్ షోలు రద్దయ్యాయి. వివాదాలు, పాత బాకీలు సర్దుమణిగి.. బొమ్మ పడడానికి చాలా టైమ్ పట్టింది.సెకండ్ షో.. కల్లా.. షోలు పడ్డాయి.
అయితే.. ఈసినిమాకి పాజిటీవ్ టాక్ రావడంతో చిత్రబృందమే కాదు. యావత్ చిత్రసీమ ఊపిరి పీల్చుకుంది. ఫ్లాప్ సినిమాతో 2021 ప్రారంభమైతే. ఆ సెంటిమెంట్ భయాలు టాలీవుడ్ ని వెంటాడేవి. పైగా సంక్రాంతి చాలా కీలకమైన సీజన్. ఈసీజన్‌లో వీలైనన్ని సినిమాలొస్తాయి. అవి బాక్పాఫీసు దగ్గర నిలబడితే... కాసుల వర్షం కురిపించుకుంటే, పరిశ్రమ వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి.
ఇలాంటి కీలకమైన సీజన్‌లో విడుదలైన క్రాక్.. హిట్ టాక్ తెచ్చుకుంది.కమర్షియల్ గా ఈ సినిమా రేంజ్ ఇప్పటికైతే చెప్పలేం గానీ, టోటల్ గా రవితేజ సినిమాల్లో అత్యధిక వసూళ్లు తెచ్చుకున్న చిత్రాల జాబితాలో క్రాక్ కూడా నిలుస్తుందన్న భరోసా కలిగింది. మరి వచ్చే మూడు సినిమాలూ.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి. రెడ్, మాస్టర్‌సినిమాలపైనా మంచి బజ్ ఉండడంతో ఈ సంక్రాంతి సూపర్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.