రజనీకాంత్ సినిమా అంటే బాక్సాఫీసుకు పండగ వచ్చినట్టే. అది డబ్బింగ్ సినిమా అయినా సరే - నెత్తిన పెట్టుకోవడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. రజనీ - శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'శివాజీ', 'రోబో' తొలిరోజు వసూళ్లు చూసి చిత్రసీమ షాక్ కి గురైంది. ఇప్పుడు '2.ఓ' కూడా వాటిని మించిన వసూళ్లు అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు.. రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది 2.ఓ. తెలుగులో 12.43 కోట్లు కొల్లగొట్టింది. రజనీకాంత్ సినిమాల్లో ఇదే రికార్డ్. ఓ డబ్బింగ్ సినిమా తెలుగులో తొలిరోజు ఈస్థాయిలో వసూళ్లు సాధించడం కూడా చరిత్రే. రజనీ స్టామినాకు ఈ అంకెలు అద్దం పడుతున్నాయి.
నైజాంలో 7.5 కోట్లు తెచ్చుకున్న రజనీ చిత్రం... సీడెడ్‌లో 1.90 కోట్లు ఆర్జించింది. గుంటూరులో మరో కోటి రూపాయలు,ఈస్ట్ , వెస్ట్ కలసి 1.5 కోట్లు సంసాదించింది. తెలుగులో దాదాపుగా రూ.80 కోట్ల మార్కెట్ చేయాలన్నది నిర్మాతల లక్ష్యం. మరి ఈ జోరు ఎక్కడ వరకూ ఆగుతుందో చూడాలి. శుక్ర, శని, ఆదివారాలు ఈ జోరు కొనసాగితే.. తొలి వారంతంలో రూ.50 కోట్ల మైలు రాయి అందుకునే అవకాశం ఉంది. త్రీడీ వెర్షన్ విడుదల చేయడం నిర్మాతలకు బాగా కలిసొచ్చింది. ఆ రూపేణ టికెట్ రేటు పెరుగడం, వసూళ్ల పెరుగుదలకు దోహదం చేస్తోంది.