'2.0'
వసూళ్ళ ప్రభంజనం అంటే ఇదేనేమో.! అంచనాలకు మించి '2.0' వసూళ్ళను కొల్లగొడుతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన '2.0' సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 400 కోట్లు వసూలు చేసిందనే ప్రచారం జరుగుతోంది. అమెరికాలో కేవలం నాలుగు రోజుల్లోనే 3.5 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టిందట '2.0'. ఓవరాల్‌గా 52.5 మిలియన్ డాలర్స్ వసూలు చేసిందన్నది ఓ అంచనా.
ఈ ఫిగర్స్ నిజమే అయితే, ఓ తమిళ సినిమాకి.. కాదు కాదు, ఓ ఇండియన్ సినిమాకి దక్కిన అరుదైన గౌరవంగా దీన్ని భావించొచ్చు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ విజువల్ వండర్ విషయంలో ఫస్ట్ డే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సూపర్ హిట్, మైండ్ బ్లోయింగ్ అనే టాక్‌తోపాటు, 'మరీ ఏమంత గొప్పగా లేదు' అన్న పెదవి విరుపులూ విన్పించాయి.
అయితే రజనీకాంత్ సినిమా 'బాగుంది' అనే టాక్ సంపాదిస్తే ఆ వసూళ్ళు ఎలా వుంటాయో చెప్పడానికి '2.0' సినిమానే నిదర్శనం. నాలుగు రోజుల వీకెండ్ కావడంతో, వసూళ్ళ ప్రభంజనం బాక్సాఫీస్ వద్ద కన్పించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 25 కోట్లకు పైగా కొల్లగొట్టిందని సమాచారమ్. అయితే, '2.0' సినిమాని 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన దరిమిలా, ఈ ప్రభంజనం సరిపోదు, ఇంతకు మించిన ప్రభంజనం కావాలి. వీకెండ్ ముగిసింది.. అసలు సిసలు పరీక్ష ఈ రోజే మొదలు కానుంది '2.0' సినిమాకి.