రామ్ - లింగు స్వామి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. కృతి శెట్టి కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఓ కీలకమైన పాత్రకోసం ఆది పినిశెట్టిని ఎంచుకున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈరోజే.. ఆది పినిశెట్టి సెట్లోకి అడుగుపెట్టాడని సమాచారం. ఈ సినిమా కోసం ఆదికి భారీ ఎత్తున పారితోషికం ఇచ్చారని తెలుస్తోంది. తెలుగు - తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రెండు చోట్లా.. ఆది పినిశెట్టి సుపరి చితుడే కాబట్టి.. తనని ఎంచుకున్నార్ట.
యాక్షన్ నేపథ్యంలో సాగే కథ ఇది. `ఉస్తాద్` అనే పేరు పరిశీలనలో ఉంది. ఇందులో రామ్ ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. రామ్ కి విలన్ గా తమిళ హీరో ఆర్య నటిస్తాడని చెప్పుకున్నారు. ఆ ప్లేసులోని ఆది పినిశెట్టి వచ్చాడా? లేదంటే ఆర్య కూడా ఈ సినిమాలో ఉన్నాడా? అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి. `సరైనోడు`లో విలన్ గా నటించాడు ఆది పినిశెట్టి. పవన్ `అజ్ఞాతవాసి`కీ తనే విలన్. మరి రామ్ కి విలన్ అయ్యాడో, లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.