సినిమా ఫ్లాప్: అమీర్ ఖాన్.!
అమీర్ ఖాన్ కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'. అలాంటి సినిమా ఇంకెప్పుడూ చేయద్దు అని అభిమానులు తమ అభిమాన నటుడికి సలహాతో కూడిన వార్నింగ్ ఇచ్చారు. అమీర్‌ఖాన్ అంటే మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అని ఇప్పటిదాకా అందరూ అనుకున్నారు. కానీ ఒక్క సినిమా పరాజయంతో ఈక్వేషన్స్ మారిపోయాయి. పరిస్థితి తీవ్రతను గ్రహించిన అమీర్‌ఖాన్ తప్పు జరిగినందుకు క్షమించమని కోరాడు. సినిమాను చాలా కష్టపడి చేశామన్నాడు. కొంతమందికి సినిమా నచ్చింది.
కానీ ఎక్కువమందిని నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై నమ్మకం పెట్టుకున్నవారందరికీ క్షమాపణ చెప్పడం తన బాధ్యత అని అన్నాడు అమీర్‌ఖాన్. త్వరలో ఈ సినిమా చైనాలో విడుదల కాబోతోంది. అక్కడ ఆ సినిమా విజయవంతం అవ్వచ్చు. కాకపోవచ్చు. ఎవరి అభిప్రాయం వాళ్లు స్వేచ్ఛగా చెప్పే వీలుంది. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నాం. ఇంకోసారి ప్రేక్షకుల్ని నిరాశపరిచే సినిమాలు చేయను.
మరింత కష్టపడి పని చేస్తా.. అని అమీర్‌ఖాన్ అభిమానులకు హామీ ఇచ్చాడు. 350 కోట్లు దాకా ఈ సినిమా కోసం ఖర్చు చేస్తే 150 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. అమీర్‌ఖాన్, కత్రినా కైఫ్, అమితాబ్‌బచ్చన్ వంటి మేటి తారలు కూడా ఈ సినిమాని గట్టెక్కించలేకపోయారు. వాస్తవానికి ప్రీరిలీజ్ హైప్ పరంగా 'బాహుబలి'తో పోటీ పడ్డ సినిమా ఇది. కానీ అంచనాల్లో మాత్రం ఆ స్థాయిని అస్సలు అందుకోలేకపోయింది.