ఏప్రిల్ 29న ఆచార్య రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈలోగా మెల్లగా ప్రమోషన్లు కూడా మొదలెట్టేస్తున్నారు. ఇటీవలే ఆచార్య థియేటరికల్ ట్రైలర్ వచ్చింది. యాక్షన్ ప్యాక్డ్ తో రూపొందిన మెగా ట్రైలర్ ఇది. చిరు, చరణ్‌లను పక్క పక్కన చూసి, అభిమానులు పులకించిపోయారు. అయితే కొంతమందికి ఆచార్య ట్రైలర్ నచ్చలేదు. చిరులోని కామెడీ టైమింగ్ ఈ ట్రైలర్‌లో మిస్సయ్యిందని, సిగ్నేచర్ స్టెప్పులు చూసే అవకాశం రాలేదని కంప్లైంట్ చేస్తున్నారు. అంతే కాదు.. పూజా హెగ్డేని కూడా ఒకట్రెండు ఫ్రేములకే సరిపెట్టారు. ఆ పాత్రకి డైలాగే ఇవ్వలేదు. ఆ మాటకొస్తే.. చిరు సరసన నటించిన కాజల్.. అస్సలు కనిపించలేదు. ఇది ఈ ట్రైలర్‌లోని మరో మైనస్.
చిరంజీవి పక్కన కాజల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. `లాహే.. లాహే` పాటలో కాజల్ స్టెప్పులు కూడా వేసింది. అయితే ప్రచారంలో మాత్రం కాజల్ ని పట్టించుకోవడం లేదు. దానికి కారణాలు ఏమై ఉంటాయా? అనేదే డౌటు. ట్రైలర్లోనే ఆ పాత్రని లేపేస్తే, సినిమాలో ఉంచుతారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూజా హెగ్డే ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉంది. ఆమెకైనా ట్రైలర్‌లో ఓ డైలాగు ఇచ్చి ఉండాల్సింది. నిజానికి పూజా కంటే, కాజల్ కి స్క్రీన్ స్పేస్ ఎక్కువట. అలాంటిది కాజల్ నే దాచేశారు. దానికి గల కారణాలేంటో... దర్శక నిర్మాతలకే తెలియాలి.