ఆచార్య డిజాస్టర్ అన్నది తొలి రోజే తేలిపోయిన విషయం. వారం రోజులు కూడా ముగియకముందే.. ఆచార్య థియేటర్లన్నీ ఖాళీ అయిపోయాయి. చిరు కెరీర్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. బయర్యు కూడా భారీగా నష్ఠపోయారు. వాళ్లని ఎలాగోలా ఒడ్డున పడేయాలని అటు కొరటాల, ఇటు చిరంజీవి ప్రయత్నిస్తున్నారు. ఈలోగా చిరుపై బయ్యర్ల నుంచి ఒత్తిడి కూడా మొదలైపోయింది. ఇటీవలే.. నైజాం బయ్యర్ చిరుకి ఓపెన్ లెటర్ రాశాడు. అది బాగా వైరల్ అవుతోంది. చిరు తనని కాపాడాలని, ఆదుకోవాలని, లేదంటే మరో సినిమా కొనే పరిస్థితి లేదని ఆ లెటర్‌లో పేర్కొన్నాడు. నష్టాలు 75 శాతానికి పైమాటే అన్నది ఆ లెటర్ సారాంశం.
చిరు ఇప్పటి వరకూ 20, 30 శాతం వెనక్కి ఇస్తే సరిపోతుందని భావించాడు. కానీ.. ఇప్పుడు 50 శాతానికి పైన ఇస్తే గానీ బయ్యర్లు శాంతించేలా లేరు. అదంతా తిరిగి ఇవ్వడం దాదాపుగా అసాధ్యం. ఇలా మరో ఇద్దరు ముగ్గురు బయ్యర్లు బయటకు వచ్చి.. లెటర్లూ, మీడియా అంటూ హడావుడి చేస్తే తప్పకుండా చిరుపై ఒత్తిడి పెరుగుతుంది. అజాత శత్రువు, ఆపద్భాంధవుడు అనే ఇమేజ్‌ని పాడుచేసుకోవడం చిరుకి ఏమాత్రం ఇష్టం ఉండుదు. కాబట్టి ఎంతో కొంత రికవరీ చేయడానికి ఆయన ప్రయత్నిస్తారు. కాకపోతే.. బయ్యర్లంతా ఇలా ఒకరి తరవాత ఒకరు చిరుని కార్నర్ చేస్తేనే ఇబ్బంది. చివరికి చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.