'ఆర్ ఎక్స్ 100', 'గుణ 369'.. అంటూ రెండు నెంబర్స్‌ని తన సినిమా టైటిల్స్‌లో పొందుపరిచిన యంగ్ హీరో కార్తికేయ ఇప్పుడు మరో నెంబర్‌తో టైటిల్ వదిలాడు. హీరోగా కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రానికి '90 ఎమ్‌ఎల్' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ ప్రొడక్షన్స్‌పై ఈ సినిమా రూపొందనుంది. ఫస్ట్‌లుక్, టైటిల్ లోగో చూస్తుంటే, ఫుల్ లెంగ్త్ యూత్ ఎంటర్‌టైనర్‌లాగే కనిపిస్తోంది ఈ సినిమా. శేఖర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో నెంబర్ బాగానే వర్కవుట్ అయ్యింది కార్తికేయకు. సెన్సేషనల్ హిట్ కొట్టాడు.
తర్వాత వచ్చిన 'హిప్పీ'తో నిరాశపరిచినా, మూడో సినిమా 'గుణ 369' అంటూ వచ్చి ఓకే అనిపించాడు. ఆ తర్వాత ఇదిగో '90 ఎమ్‌ఎల్' అంటూ పాల సీసాలో కూడా మందు పోసుకుని తాగేసే ఈ కుర్రాడి కథ ఎలా ఉండబోతోందో.. చూడాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. ఫస్ట్‌లుక్‌లో కొన్ని వందల మందు సీసాల మధ్య హాయిగా కాలిమీద కాలు వేసుకుని పడుకున్నాడు. ఆహా ఏమి ఆనందం..! అన్న ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.
ఓ కాలికి షూ ఉంది. ఇంకో కాలి షూని పక్కన పెట్టుకున్నాడు. ఓ చేతిని తల కింద పెట్టుకుని, ఇంకో చేతితో 'ఆహా' అని సైన్ ఇస్తూ, ఫేస్‌లో 100 పర్సెంట్ స్మైల్ ఇచ్చాడు. ఈ ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు కార్తికేయ విలన్‌గా నటించిన 'గ్యాంగ్ లీడర్' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతవరకూ హీరోగానే చూశాం. విలన్‌గా కూడా తన పవర్ చూపిస్తానంటూ వస్తున్నాడు మన కార్తికేయ. చూడాలి మరి, విలన్‌గా కార్తికేయను ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో.