'లీడర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన అందాల భామ రిచా గంగోపాధ్యాయ్ పెళ్ళి పీటలెక్కబోతోంది. ఈ ఎన్నారై బ్యూటీ ఓ అమెరికన్ని పెళ్ళాడబోతోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఎంగేజ్మెంట్ అయ్యిందనీ, త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నామనీ, ఇప్పటికైతే ఇంకా ముహూర్తం ఖరారు కాలేదనీ చెప్పుకొచ్చింది రిచా గంగోపాధ్యాయ్.
'లీడర్'తోపాటుగా తెలుగులో 'మిర్చి', 'మిరపకాయ్', 'సారొచ్చారు' తదితర సినిమాల్లో రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్గా నటించిన విషయం విదితమే. నాగార్జున సరసన 'భాయ్' సినిమాలోనూ నటించింది రిచా. మరోపక్క తమిళంలోనూ ఓ సినిమాలోనూ నటించిన ఈ బ్యూటీ, గత కొంతకాలంగా అమెరికాలోనే వుంటోంది. సినిమా కెరీర్ ఆశాజనకంగా లేకపోవడంతో అమెరికా చెక్కేసి, అక్కడే ఉన్నత చదువుల్ని కొనసాగించి, ఫ్రీ లాన్సర్గా పలు ఎస్సైన్మెంట్స్ కూడా చేపట్టింది.
సినిమాలు, పెళ్ళి గురించి ఎప్పుడు గాసిప్స్ వచ్చినా సోషల్ మీడియా వేదికగా ఖండిస్తూ వచ్చిన ఈ బ్యూటీ లేటెస్ట్గా తన పెళ్ళి కబురు సోషల్ మీడియా వేదికగానే వెల్లడించడం గమనార్హం. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశాననీ, మళ్ళీ సినిమాల్లో కన్పించే అవకాశం లేదని గతంలోనే రిచా స్పష్టతనిచ్చేసిన విషయం విదితమే.