'అజ్ఞాతవాసి' సినిమాకి రెండు పరాజయాల్ని పవన్ తన ఖాతాలో వేసుకున్నా, తన తదుపరి సినిమాపై ఆ ఫెయిల్యూర్స్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. అదే పవన్‌కళ్యాణ్ మేనియా అంటే. 'అజ్ఞాతవాసి' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. టాక్ ఎలా ఉంది? అనే విషయం పక్కన పెడితే ఓవర్సీస్‌లో మాత్రం పవన్‌కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబోకి తిరుగే లేదని ప్రీమియర్స్ చెబుతున్నాయి.
ప్రీమియర్స్ ద్వారా ఆల్రెడీ 1 మిలియన్ మార్క్‌ని తొలి రోజే దాటేశాడు పవన్‌కళ్యాణ్. 1.4 మిలియన్ డాలర్స్ వసూలయ్యాయక్కడ ప్రీమియర్స్‌తో. ఓ భారతీయ సినిమాకి సంబంధించి అత్యంత గ్రాండ్ రిలీజ్ 'అజ్ఞాతవాసి'కే జరిగింది. లొకేషన్స్, థియేటర్స్ పరంగా 'అజ్ఞాతవాసి' ఈ రికార్డ్‌ని తన సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా ఓవర్సీస్‌లో ఇంకే ఇండియన్ సినిమా చేరుకోలేని రికార్డ్‌ని 'బాహుబలి-2' తన ఖాతాలో పదిలంగా ఉంచుకుంది.
అయితే 'బాహుబలి-1' రికార్డ్ మాత్రం 'అజ్ఞాతవాసి'తో తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం యూఎస్ ప్రీమియర్స్‌ని లెక్కల్లోకి తీసుకుంటే 'బాహుబలి-2' తొలి స్థానంలో ఉండగా (4.5 మిలియన్ డాలర్స్), రెండో స్థానంలో 'అజ్ఞాతవాసి' (1.4 మిలియన్ డాలర్స్) నిలిచిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 'అజ్ఞాతవాసి' రాకతో మూడో స్థానంలోకి 'బాహుబలి-1' (1.36 మిలియన్ డాలర్స్స్) వెళ్ళిపోగా, నాలుగో స్థానంలో మెగాస్టార్ 'ఖైదీ నెంబర్ 1' (1.29 మిలియన్ డాలర్స్) నిలిచింది. ఆ తర్వాతి స్థానం మళ్ళీ పవన్‌కళ్యాణ్ సర్దార్ గబ్బర్‌సింగ్‌దే కావడం గమనించదగ్గ ఇంకో ముఖ్యమైన విషయం.