2018లో తెలుగు సినీ ప్రేక్షకులకు తొలి 'కానుక' ఇచ్చేందుకు 'అజ్ఞాతవాసి' ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. నిన్న అర్థరాత్రి నుంచే చాలా చోట్ల ప్రీమియర్స్ ప్రారంభమయ్యాయి. దాంతోపాటే, అభిమానుల సంబరాలూ ఆకాశాన్నంటేశాయి. అర్థరాత్రి 'దీపావళి' పండుగ కాంతులు 'అజ్ఞాతవాసి' థియేటర్ల వద్ద కన్పించాయి.
ఓవర్‌సీస్‌లో అభిమానుల హంగామాకి ఆకాశమే హద్దుగా మారింది. తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఏ సినిమాకైనా ఆ హీరో అభిమానుల నుంచి వచ్చే ఫస్ట్ రిపోర్ట్ సూపర్బ్‌గానే ఉంటుంది. 'అజ్ఞాతవాసి' విషయంలోనూ అదే జరుగుతోంది. 'ఫీల్ ద పవర్' అంటూ అభిమానులు థియేటర్లలోకి వెళ్ళేముందూ, వచ్చేముందూ ఒకే తరహా ఉత్సాహంతో కనిపిస్తున్నారు. అయితే, ఫైనల్ రిజల్ట్ ఏంటన్నది మార్నింగ్ షో తర్వాతే తేలుతుంది కాబట్టి అప్పటిదాకా వేచి చూడక తప్పదు. ఇంకో వైపున అంతా ఊహించినట్టుగానే, అమెరికాలో ప్రీమియర్స్‌తోనే 1 మిలియన్ క్లబ్‌లోకి చేరిపోయింది 'అజ్ఞాతవాసి'. రికార్డు సంఖ్యలో లొకేషన్లు, థియేటర్లతో 'అజ్ఞాతవాసి' ఓవర్సీస్ ఆడియన్స్ ముందుకు వచ్చింది.
ఈ వ్యవహారాలిలా ఉంటే, పైరసీ కూడా చాలా వేగంగా 'అజ్ఞాతవాసి'ని ఇంటర్నెట్‌లోకీ, మొబైల్ పోన్లలోకీ తీసుకొచ్చేయడం బాధాకరం. 'హీరో ఎంట్రీ సీన్' అనీ, ఇంకో సీన్ అనీ క్లిప్పింగ్స్‌ని కొందరు సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. పైరసీ జాడ తెలిస్తే ఫిర్యాదు చేయండంటూ అభిమానులనుంచి అవేర్‌నెస్ కార్యక్రమాలు జరుగుతున్నా, పైరసీకి మాత్రం అడ్డుకట్ట పడటంలేదు. ఏదేమైనా పవన్‌కళ్యాణ్ అభిమానులు మాత్రం 'ఫీల్ ద పవర్' అంటూ చేస్తోన్న ఈ హంగామాకి తొలి రోజు వసూళ్ళ రికార్డులు 'అజ్ఞతవాసి' ఖాతాలో ఇప్పటికే ఖాయమైపోయాయి.