రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్‌ల తరవాత.. అంతటి సత్తా, స్టామినా ఉన్న కథానాయకులలో అజిత్ ఒకడు. తమిళ నాట అజిత్ పాపులారిటీ, క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. అజిత్ సింప్లిసిటీ కూడా అభిమాన గణం పెరగడానికి ఓ కారణంగా నిలుస్తోంది. జయలలిత మరణం తరవాత.. ఆ స్థానాన్ని భర్తీ చేసే సత్తా అజిత్‌కి మాత్రమే ఉందని చాలామంది నమ్మకం. అందుకే అజిత్ రాజకీయ ప్రవేశంపై చాలా కాలం నుంచి వార్తలువస్తున్నాయి. 2019 ఎన్నికల దగ్గర పడుతున్న ఈ తరుణంలో ఆ వార్తలకు మరింత శక్తి వచ్చింది.
అయితే అజిత్ మాత్రం తన రాజకీయ ప్రస్థానం విషయంలో క్లారిటీగానే ఉన్నాడు. తనకి క్యూలో నిలబడి ఓటు వేయడం అంటేనే ఇష్టమని, రాజకీయాల్లో ప్రవేశించడంపై తనకేమాత్రం ఆసక్తి లేదని, ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ రాజకీయాలలో పాల్గొననని క్లారిటీ ఇచ్చేశాడు. తన అభిమానులకు కూడా ఈ సందర్భంగా ఓ సూచన చేశాడు అజిత్. ''పలానా వాళ్లకు ఓటేయమని నేనెప్పుడూ చెప్పను. మీ ఓటు మీ ఇష్టం. రాజకీయాల విషయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. మీ అభిప్రాయాల్ని మాత్రం నాపై రుద్దకండి'' అంటూ ఈ విషయాన్ని తేల్చేశాడు అజిత్.