'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ' సినిమా చేసినప్పుడు అక్షయ్‌కుమార్ స్టార్‌డమ్‌పై ఎన్నో సందేహాలొచ్చాయి. స్టార్ హీరో అలాంటి సినిమా చేయడమేంటన్న విమర్శల్ని ఎదుర్కొన్నాడాయన. అలాగే, అక్షయ్‌కుమార్ కాబట్టే అంత సీరియస్ అంశాన్ని హైలైట్ చేస్తూ, తెరకెక్కుతోన్న సినిమాలో నటించేందుకు ముందుకొచ్చాడన్న ప్రశంసలూ దక్కాయి. వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించేలా తీసిన ఆ సినిమా విడుదలకు ముందూ, విడుదలయ్యాకా ఓ ప్రభంజనమే.
ఆ స్ఫూర్తితోనే, ఇంకో సోషల్ ఇష్యూని పట్టుకుని సినిమా తెరకెక్కించారు అక్షయ్‌కుమార్ హీరోగా. అదే 'ప్యాడ్ మ్యాన్' విడుదలకు సిద్ధమైన 'ప్యాడ్‌మ్యాన్' ప్రచారం జోరుగా సాగుతోందిప్పుడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా 'ప్యాడ్ మ్యాన్ ఛాలెంజ్'ని సోషల్ మీడియాలో విసిరాడు అక్షయ్‌కుమార్. అంతే, ఆ ఛాలెంజ్‌కి అనూహ్య స్పందన వచ్చిపడ్తోంది. 'నిశ్శబ్దాన్ని వీడండి' అంటూ సెలబ్రిటీలు, 'మహిళలు రుతుక్రమంలో వాడే ప్యాడ్స్' గురించి ప్రచారం షురూ చేశారు. కొద్ది గంటల్లోనే ఇదొక ప్రభంజనమయ్యింది. బాలీవుడ్‌లో హేమాహేమీలే కాదు, క్రికెటర్లు సైతం 'ప్యాడ్స్'తో ఫొటోలకు పోజులిస్తూ, వాటిని సోషల్ మీడియాలో పెడుతున్నారు.
'కేర్ ఫ్రీ' కావొచ్చు, ఇంకో బ్రాండ్ కావొచ్చు. మహిళలు రుతుక్రమంలో వాడే న్యాప్కిన్స్ (ప్యాడ్స్)పై 'కొంత ఏవగింపు' వుంది సమాజంలో. ఆ కారణంగా ఇబ్బందుల్ని ఎదుర్కొన్న ఓ మహానుభావుడు, తక్కువ ధరలో న్యాప్కిన్స్ తయారు చేసి, ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాడు. అతని జీవిత కథ ఆధారంగానే 'ప్యాడ్‌మ్యాన్' సినిమా తెరకెక్కింది. ఏ సినిమాకి అయినా ఇంతకన్నా పబ్లిసిటీ ఇంకేం కావాలి? ఇది కేవలం పబ్లిసిటీ కోణంలోనే చూడలేం. ఇదొక సామాజిక బాధ్యత. సినిమా ప్రమోషన్, 'ప్యాడ్స్'పై ప్రచారం అన్నీ ఒకేసారి కలిసొచ్చేశాయి. ఆరోగ్యకరమైన సమాజం కోసమే ఇదంతా అంటున్నాడు 'ప్యాడ్‌మ్యాన్' అక్షయ్‌కుమార్.