సంక్రాంతికి విడుదలైన 'అల వైకుంఠపురం' తన జోరుని కొనసాగిస్తూనే ఉంది. ఈ వారం కూడా అల్లు అర్జున్ సినిమా బాక్సాఫీసు దగ్గర తన ప్రతాపం చూపించింది. దాంతో 'నాన్ బాహుబలి 2' రికార్డులన్నీ బద్దలైపోయాయి. బాహుబలి 2 తరవాత... అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా `అల వైకుంఠపురం` ఖ్యాతి నార్జించింది. ఈ విషయాన్ని చిత్రబృందం కూడా అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకూ ఈ చిత్రానికి రూ.144 కోట్ల షేర్ వచ్చింది. రూ.150 కోట్ల మైలు రాయికి దగ్గరగా ఉంది. ఈ వారాంతంలో కచ్చితంగా రూ.150 కోట్లు కూడా కొల్లగొట్టడం ఖాయం అనిపిస్తోంది.
నైజాంలో 38 కోట్లు, సీడెడ్‌లో రూ.17.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.19.43 కోట్లు దక్కాయి. గుంటూరులో రూ.9.8 కోట్లు, ఈస్ట్‌లో 10.45 కోట్లు, వెస్ట్‌లో 7.72 కోట్లు వసూలు చేసింది. రెస్టాఫ్ ఇండియాలో 11 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకూ 17 కోట్లు తెచ్చుకుంది. ఈ సంక్రాంతి సీజన్‌లో సరి లేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాల మధ్య గట్టి పోటీ ఎదురైన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలూ ఎంతెంత వసూలు చేస్తాయన్న విషయంలో చాలా ఆసక్తి ఎదురైంది. సరిలేరు నీకెవ్వరు లెక్కలు కూడా వచ్చేస్తే.. ఎవరెవరు ఎక్కడెక్కడ పైచేయి సాధించారన్న విషయంలో ఓ క్లారిటీ వస్తుంది.