తెలుగు సూపర్ హిట్ చిత్రం.. `అల వైకుంఠపురములో` చిత్రాన్ని ఇప్పుడు హిందీలో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఇది హాట్ టాపిక్ అయ్యింది. తెలుగులో రెండేళ్ల క్రితమే విడుదలైన అల వైకుంఠపురములో ఇప్పుడు హిందీలో డబ్ చేయడం ఏమిటి? అనేది అందరి ప్రశ్న. ఎందుకంటే.. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమా దాదాపుగా పూర్తి కావొచ్చింది కూడా. ఈ యేడాది నవంబరులో విడుదల చేస్తారు. గీతా ఆర్ట్స్, హారిక హాసిని కలిసి రీమేక్ రైట్స్ ఓ హిందీ నిర్మాతకు అమ్మేశారు. అలాంటప్పుడు డబ్బింగ్ ఎలా చేస్తారు?
అయితే... అల్లు అర్జున్ ఆలోచనలు వేరు. `పుష్ప` బాలీవుడ్ లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. నార్త్ నుంచి ఈసినిమాకి దాదాపుగా వంద కోట్లు వచ్చాయి. బన్నీ రేంజ్, స్టామినా బాలీవుడ్ జనాలకు అర్థమయ్యాయి. ఇదే ఊపులో.. మరో సినిమాని వదిలితే, బన్నీ బాలీవుడ్ లో స్ట్రాంగ్ అయిపోతాడు. అందుకే ఏరి కోరి.. అల వైకుంఠపురములో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్. కాబట్టి.. బాలీవుడ్ లోనూ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే... బాలీవుడ్ లో వరుసగా రెండు హిట్లు కొట్టినవాడు అవుతాడు. కాకపోతే... రీమేక్ రైట్స్ నిర్మాతలతోనే చట్టపరమైన సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటన్నింటిపై లోతుగా చర్చించాకే ఈ సినిమాని డబ్బింగ్ చేయాలన్న ఆలోచనకు వచ్చార్ట. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.