గత వారం సంక్రాంతి హంగామా తో బాక్సాఫీసు కాస్త కళగానే కనిపించింది. బంగార్రాజు వసూళ్ల వర్షం కురిపించుకుంటే, హీరో, రౌడీ బాయ్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొత్త సినిమాల తాకిడితో... థియేటర్లు సందడిగా మారాయి. అయితే ఈవారం ఆ కళ తగ్గింది. ఈ శుక్రవారం బాక్సాఫీసు దగ్గర కొత్త సినిమాలేం లేవు. ఉనికి, సైకో వర్మ, వధు కట్నం లాంటి చిన్న సినిమాలు వస్తున్నాయి. ఈ వారం కూడా బంగార్రాజునే పెద్ద దిక్కుగా మారబోతున్నాడు. కాస్తో కూస్తో రౌడీ బోయ్స్, హీరోలు లాభపడే అవకాశం ఉంది. సాధారణంగా సంక్రాంతి తరువాతి వారం బాక్సాఫీసు చప్పగా ఉంటుంది. సంక్రాంతి సినిమాల హవానే జనవరి అంతా కొనసాగుతుంది. అందుకే ఈవారంలో కొత్త సినిమాల తాకిడేం లేదు.
అయితే ఓటీటీ మాత్రం సందడిగా మారబోతోంది. అఖండ, శ్యామ్ సింగరాయ్ ఈ వారమే ఓటీటీల్లోకి వస్తున్నాయి. ఈనెల 21న అఖండ హాట్ స్టార్‌లో సందడి చేయబోతోంది. అదేరోజు నెట్ ఫ్లిక్స్‌లోకి... శ్యామ్ సింగరాయ్ వస్తోంది. జీ 5లో లూజర్ 2 విడుదల కానుంది. డిసెంబరు 2న విడుదలైనా... సంక్రాంతి లోనూ తన హవా చాటుకుంది అఖండ. ఓటీటీలోనూ ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కే అవకాశం ఉంది. ఇక కుటుంబ ప్రేక్షకులు శ్యామ్ సింగరాయ్‌కి బ్రహ్మారథం పడతారని ఓటీటీ వర్గాలు భావిస్తున్నాయి. లూజర్ సీజన్ 1 కి మంచి స్పందన వచ్చింది. కాబట్టి ఈ సీజన్‌పైనా అంచనాలు ఏర్పడ్డాయి. థియేటర్లో కొత్త సినిమాల హడావుడేం లేకపోయినా ఓటీటీ వరకూ కొత్త సినిమాల జాతర బాగానే కనిపిస్తోంది. వీటితో ఈవారాంతంలో కాలక్షేపం అయిపోవచ్చు.