పవన్ కళ్యాణ్ కరాటే చేస్తే, ఆలీ కుంగ్ ఫూ చేశాడట. అలా వీరిద్దరూ గట్టిగా కొట్టుకున్నారట. ఇదేంటీ కామెడీ..? అసలే వీరిద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది కదా అనుకుంటున్నారా.? ఇదిప్పటి సంగతి కాదు. ఎప్పటిదో. అయితే తాజాగా ఓ ఛానెల్‌లో అలీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ ప్రోగ్రాంలో రేణూ దేశాయ్ అడిగిన ప్రశ్నకు అలీ చెప్పిన సమాధానమిది.
'ఏంటీ పవన్ కళ్యాణ్‌కీ మీకూ మధ్య గొడవలట కదా ఏంటి సంగతీ.?' అని రేణూదేశాయ్ అలీని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు అలీ ఇలా సమాధానం చెప్పి నవ్వేశాడు. అసలు విషయమేంటంటే, 'మా మధ్య అలాంటి గొడవలేం లేవు. మీడియా చిత్రీకరించిన కథనాలే అవి.. మేమెప్పుడూ స్నేహితులమే..' అని చివరిగా అలీ డీప్‌గా వివరణ ఇచ్చారు. అయితే రాజకీయం వీరిద్దరినీ విడదీసిన మాట వాస్తవమే.
ఇటీవల అలీ వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్, అలీపై విమర్శలు చేయడం, వాటికి అలీ కౌంటర్లు ఇవ్వడం, వాటిని మీడియా మరింత పెద్దది చేసి చూపించడం ఇవన్నీ తెలిసిన విషయాలే. కానీ తాజాగా అలీ, రేణూదేశాయ్‌తో చెప్పిన మాటల పరంగా వీరిద్దరి మధ్యా ప్రస్తుతం పైకి కనిపిస్తున్నంత వైరం అయితే లేదనీ అర్ధమవుతోంది. స్నేహం వేరు. రాజకీయం వేరు.. దట్సాల్.!