నిఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'అర్జున్ సురవరం'. ఎప్పుడో విడుదల కావల్సి ఉంది. కానీ, వెంటాడిన ఆటంకాల నేపథ్యంలో ఈ సినిమా అటూ ఇటూ కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎట్టకేలకు అన్ని చిక్కులూ విడిపించుకుని, ఈ నెల 29న విడుదలకు సిద్ధమైంది. ఒక రకంగా నిఖిల్ ఫ్యాన్స్‌కిది హ్యాపీ న్యూస్ అయినా, ఎందుకో ఈ సినిమా ప్రమోషన్స్‌పై చిత్ర యూనిట్ అంతగా శ్రద్ధ పెట్టడం లేదు. సోషల్ మీడియా వేదికగా నిఖిల్ ఒక్కడే ఏదో అలా అలా ప్రమోట్ చేస్తున్నాడు. కానీ, అది చాలదు.
ఈ రోజుల్లో ప్రమోషన్స్ లేకుంటే ఎంత భారీ బడ్జెట్ మూవీ అయినా ఢమాల్ అనడం ఖాయం. అలాంటిది ఓ మోస్తరు సినిమాలకు భారీ ఎత్తున ప్రమోషన్స్ ఉండాల్సిందే. మొదటిసారి రిలీజ్ కోసమని సినిమాని భారీగా ప్రమోట్ చేశారు. కానీ, విడుదల లేట్ కావడంతో, ఆ ప్రమోషన్స్ కూడా 'లేటు' లిస్టులోకి వెళ్లిపోయాయి. అటూ ఇటూగా 20 రోజులు కూడా లేని 'అర్జున్ సురవరం' ఏదో ఒకటి చేసి, స్పీడు పెంచకపోతే కష్టమే మరి.
టి. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. పవర్ ఫుల్ రిపోర్టర్ పాత్రలో నిఖిల్ కనిపిస్తున్నాడు ఈ సినిమాలో. కంటెంట్ పరంగా సినిమా ఆసక్తిగానే ఉంది. మరి ఆ ఆసక్తి మరింత పెరిగేలా నిఖిల్ గట్టిగా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఇదే సూచిస్తున్నారట. కానీ, నిఖిల్ చేతిలో ఏముంది. ఏం చేయాలన్నా.. చిత్ర నిర్మాతలు కదా చేయాలి.