అల్లు అర్జున్ హీరోగా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రచయిత వక్కంతం వంశీ తొలిసారి దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సైనికుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ సైనికుడిగా బోర్డర్‌లో సర్వీస్ చేస్తూనే, అమ్మాయితో ప్రేమ వ్యవహారం కూడా నడిపిస్తాడు. అందుకే తాను సైనికుడే కాదు, ప్రేమికుడు కూడా అని అల్లు అర్జున్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి ఓ పాట ద్వారా చెప్పుకొచ్చాడు. ఇదంతా బాగానే ఉంది. అయితే మరో పక్క అల్లు అర్జున్ తమ్ముడున్నాడు కదా.. అదేనండీ అల్లు శిరీష్. ఇప్పుడీ అల్లు వారి చిన్నబ్బాయి కూడా ఇదే సబ్జెక్ట్‌తో వస్తున్నాడు. 'యుద్ధభూమి 1971 ' అంటూ తాను కూడా ఆర్మీ ఆఫీసర్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు.
అయితే ఈ చిత్రం గతేడాది మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమానే ఇప్పుడు తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో అల్లు శిరీష్‌తో పాటు, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మోహన్‌లాల్ లెఫ్టినెంట్ కల్నల్ మహదేవన్ పాత్రలో కనిపించగా, శిరీష్ లెఫ్టినెంట్ చిన్మయ్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో అల్లు శిరీష్‌కి మాత్రం 'నో టైమ్ ఫర్ లవ్ లెటర్స్ అండ్ రొమాన్స్.. ఇన్ వార్‌ఫీల్డ్..' అంటూ కల్నల్ పాత్రలో ఉన్న మోహన్‌లాల్, పాపం శిరీష్‌కి సూచనలిస్తున్నారు. అక్కడ సూర్యలో అన్యయ్య మాత్రం 'ఐ యామ్ లవర్ ఆల్సో సోల్జర్ ఆల్సో' అంటున్నాడు. ఇదే తేడా ఈ ఇద్దరికీ.
కానీ ఇద్దరూ వార్ ఫీల్డ్‌లో తమ ప్రతిభని ఓ రేంజ్‌లో ప్రదర్శించేస్తారు మరి. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో ఇంకా స్పష్టత లేదు. కానీ అన్నయ్య బన్నీ మాత్రం మే 4న వచ్చేస్తున్నాడు.