విజయ్ దేవకొండ, అల్లు అర్జున్.. తమ అభిమానుల్లో 'కొందరికి' చాలా పెద్ద షాక్ ఇచ్చారు. 'గీత గోవిందం' సినిమా తర్వాత, 'నోటా' విడుదలకు ముందు విజయ్ దేవరకొండ అభిమానులు సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. 'రౌడీస్' పేరుతో కొందరు సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ హంగామాకి విజయ్ దేవరకొండ 'ఆటిట్యూడ్' కాస్తా, 'అగ్నికి ఆజ్యం' పోసినట్లయ్యింది. అల్లు అర్జున్‌తోపాటు చాలామంది హీరోలపై 'రౌడీస్' వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియాలో.
ప్రతిగా, ఇతర హీరోల అభిమానులూ విజయ్ దేవరకొండపై జుగుప్సాకరమైన విమర్శలు చేయడం చూశాం. అయితే, అంతిమంగా సినీ పరిశ్రమ అంతా ఒక్కటే. హీరోలందరూ అన్నదమ్ముల్లానే మెలుగుతుంటారు. ఎన్టీఆర్, చరణ్ కాంబోలో ఓ సినిమా రాబోతోంది. మహేష్ సినిమాకి ఎన్టీఆర్ బెస్ట్ విషెస్ అందించాడు. మల్టీస్టారర్ సినిమాలు జోరందుకుంటున్న రోజులివి. ట్రెండ్ మారిందిగానీ, అభిమానులే 'దురభిమానం' అనే బావిలోంచి బయటకు రాలేకపోతున్నారు.
విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ కలిసి ఒకే వేదికపై కన్పించబోతున్నారంటే, సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరి అభిమానులమంటూ చెప్పుకుంటూ కొందరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారుగానీ, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటట?
హీరోలు, అభిమానులకు ఎప్పటికప్పుడు ఝలక్‌లు ఇస్తూనే వున్నారు. కానీ, వాళ్ళు మారరు. ఎందుకంటే, వాళ్ళసలు అభిమానులే కాదు. వాళ్ళంతా దురభిమానులే. అదీ అసలు సంగతి.