సాయి పల్లవిలోని నటిని వందకు వందశాతం ఆవిష్కరించిన సినిమా 'ఫిదా'. ఆ సినిమాతోనే సాయి పల్లవి స్టార్ అయిపోయింది. ఆ సినిమాలోని 'వచ్చిండే...' పాట ద్వారా సాయి పల్లవిలో ఓ సూపర్ డాన్సర్ ఉందని పరిశ్రమకు అర్థమైంది. ఈ పాటకు ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. వారిలో అల్లు అర్జున్ కూడా ఒకడు. ఈ పాట బన్నీకి తెగ నచ్చేసిందట.
''ఈ పాటని సాయి పల్లవి ఎన్నిసార్లు చూసిందో తెలీదుగానీ, నేను మాత్రం చాలాసార్లు చూశాను. తనతో ఎప్పుడెప్పుడు డాన్స్ చేస్తానా అని ఎదురుచూస్తున్నా'' అన్నాడు బన్నీ. 'పడి పడి లేచె మనసు' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అల్లు అర్జున్ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 'వచ్చిండే' పాట గురించి ప్రస్తావించాడు బన్నీ.
అన్నట్టు.. సాయి పల్లవి కూడా బన్నీ డాన్స్‌కి పెద్ద ఫ్యాన్స్. ఈ విషయాన్ని తనే చెప్పింది. ''బన్నీ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తన డాన్స్‌కి పెద్ద అభిమానిని. స్కూల్లో ఫంక్షన్స్ జరుగుతుంటే.. బన్నీ పాటలకు డాన్స్ చేసేదాన్ని'' అంటోంది సాయి పల్లవి. చూస్తుంటే.. బన్నీ - సాయి పల్లవిల జంటని అతి త్వరలో వెండి తెరపై చూసే అవకాశం దక్కుతుందమో అనిపిస్తోంది. మరి ఆ రోజెప్పుడో...!