స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, 'పడి పడి లేచే మనసు' సినిమా ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. సారీ సారీ, అల్లు అర్జున్‌గారు హాజరయ్యారని అనాలేమో.! ఎందుకంటే, ఆయన అంతలా రెస్పెక్ట్ ఆశిస్తున్నాడు. మామూలుగా అయితే, స్వర్గీయ నందమూరి తారకరామారావుని ఉద్దేశించి 'ఎన్టీవోడు' అనేవారు అభిమానులు. అంటే, ఎన్టీఆర్ మీద ఎవరికీ గౌరవం లేదని కాదు. 'ఎన్టీవోడు' అంటే, 'మనోడు' అన్నంతలా అభిమానులు ఫీలయిపోయారు.
సినీ ప్రముఖులే కాదు, రాజకీయాల్లో వున్నవారూ 'గారు' అన్న మాటని పక్కన పెట్టేయాలనే అనుకుంటున్నారు. లేకపోతే, చంద్రబాబు 'చంద్రన్న' అని పిలిపించుకోవడానికి తహతహలాడటమేంటి.? 'చిరంజీవిగారూ..' అన్న పిలుపులోకంటే, 'చిరు' అన్న పిలుపే తనకు ఇష్టమని పలు సందర్భాల్లో చిరంజీవి చెబుతూ వచ్చారు. 'మనోడు' అన్న భావనలో అంత ప్రత్యేకమైన ఫీల్ వుంటుంది మరి.!
అల్లు అర్జున్ ఉద్దేశ్యం మంచిదే కావొచ్చు, కానీ.. ఆ 'క్లాసులు' తీసుకునేందుకు 'వేదిక' అనేది ఒకటి వుండాలి కదా.! సినిమా ప్రమోషన్ కోసం తనవంతు సహకారం అందించే క్రమంలో అల్లు అర్జున్ క్లాసులు పీకుతోంటే, చాలామందికి ఇబ్బందికరంగా అన్పిస్తోంది. ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలని అల్లు అర్జున్‌కి అన్పిస్తే, ఎంచక్కా ఆయన ఆ రెస్పెక్ట్ ఇచ్చేసుకోవచ్చు. అందరూ ఇవ్వాలని ఆశించడం మాత్రం సబబు కాదేమో.! వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న టైమ్‌లో ఇలా క్లాసులు పీకి, 'చాదస్తం కుర్రాడు' అన్పించుకోవడం అల్లు అర్జున్‌కి ఏమంత మంచిది కాదన్నది సినీ పరిశ్రమలో విన్పిస్తోన్న అభిప్రాయం.