అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా పట్టాలెక్కుతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. రంగస్థలం తరవాత సుకుమార్ చేస్తున్న సినిమా ఇదే. రంగస్థలం విడుదలై యేడాది దాటేసినా ఇప్పటి వరకూ సుకుమార్ సినిమా పట్టాలెక్కకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. బన్నీ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉండడం, ఐకాన్ కథకీ ఓకే చెప్పడంతో సుకుమార్ సినిమా ఉంటుందా? ఉంటే ఎప్పుడు మొదలవుతుంది? ఐకాన్‌కి ముందా, తరవాత? అంటూ చాలా సందేహాలు వెంటాడాయి.
వాటికి ఓ సమాధానం దొరికేసిందిప్పుడు. బన్నీ - సుకుమార్ సినిమాకు ముహూర్తం కుదిరింది. అక్టోబరు 3న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అక్టోబరు 15 నుంచి రెగ్యలర్ షూటింగ్ కూడా మొదలైపోనుంది. అంటే ఓ పక్క `అల వైకుంఠపురములో` సినిమా చేస్తూ, సుకుమార్ షూటింగ్‌లోనూ పాల్గొంటాడన్నమాట. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.