రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని కాపాడి సాయి ధరమ్ తేజ్ మానవత్వం చాటుకున్నాడు. రామానాయుడు స్టూడియోలో షూటింగ్ పూర్తి చేసుకుని వస్తున్న సాయి ధరమ్ తేజ్, రోడ్డుపై తన కళ్ల ఎదుటే ఓ బైకర్, కారును ఢీకొని 10 అడుగుల దూరంలో ఎగిరి పడడం గమనించాడు. వెంటనే కారు దిగి, ఆ గాయపడిన వ్యక్తి వద్దకు వెళ్లి చూడగా, ఆ వ్యక్తి తనకు స్నేహితుడైన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి కావడంతో, హుటాహుటిన చేతులపై మోసుకొచ్చి, తన కార్లో ఎక్కించుకుని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.
వైద్యులు అతనికి ప్రాణాపాయం తప్పిందని చెప్పడంతో సాయి ధరమ్ తేజ్ ఊపిరి పీల్చుకున్నాడు. జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 42లోని ఓ మూల మలుపు వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదో రోడ్డుపై యాక్సిడెంట్ జరిగిందిలే. అందరిలాగే చూశాం, వెళ్లిపోయాం అన్నట్లుగా కాకుండా సమయస్పూర్తితో స్పందించి ఆ వ్యక్తిని కాపాడిన తేజుని అందరూ ప్రశంసిస్తున్నారు.
రియల్ హీరో సాయిధరమ్ తేజ్.
— News18 Telugu (@News18Telugu) September 5, 2019
హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగీత దర్శకుడు అచ్చు రాజమణిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు సాయిధరమ్ తేజ్.#SaiDharamTej #AchuRajamani #TollywoodNews #News18Telugu pic.twitter.com/jiJVmQoFVf
మానవత్వం చాటుకోవడంలో తేజు ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సారి కాపాడాల్సిన వ్యక్తి ఆయన స్నేహితుడు కావడం విశేషం. ప్రస్తుతం తేజు 'ప్రతి రోజూ పండగే' సినిమాలో నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.