అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది గతంలో. అదే 'సన్నాఫ్ సత్యమూర్తి'. సినిమా ఓకే కానీ, అంచనాల్ని మాత్రం ఈ కాంబో అందుకోలేకపోయింది. అయితే బుల్లితెరపై మాత్రం ఈ సినిమా ఎప్పటికప్పుడు మంచి టీఆర్‌పీ రేటింగ్స్ సాధిస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ కాంబినేషన్ ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతోంది. అతి త్వరలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాపై అనౌన్స్‌మెంట్ రాబోతోందనే వార్త అటు త్రివిక్రమ్ అభిమానుల్లోనూ, ఇటు అల్లు అర్జున్ అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం 'అరవింద సమేత' సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మూడ్‌లోంచి బయటికి రాగానే, బన్నీ - త్రివిక్రమ్ సినిమా వర్క్ స్టార్ట్ అవుతోందట.
విశ్వసనీయ వర్గాల సమాచారమ్ ప్రకారం బన్నీ - త్రివిక్రమ్ సినిమాకి స్క్రిప్టు ఆల్రెడీ సిద్ధంగా ఉందట. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనింగ్ వేలో ఈ సినిమా ఉండబోతోందనీ, తగినంత యాక్షన్ పార్ట్ కూడా ఉంటుందని సమాచారమ్. ఓ సాఫ్ట్ టైటిల్ కూడా దాదాపు ఖరారయ్యిందట. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనీ తెలుస్తోంది.
అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'నా పేరు సూర్య' నిరాశపరచడంతో, తదుపరి సినిమా విషయంలో కొంత గందరగోళానికి గురయ్యాడు. విక్రమ్ కుమార్‌నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్‌నీ ఇన్ని రోజులు హోల్డ్‌లో పెట్టి, తాను హోల్డ్‌లోకి వెళ్లి, ఎట్టకేలకు 'అరవింద సమేత..' సక్సెస్ తర్వాత బన్నీ యాక్టివ్ మూడ్‌లోకి వచ్చాడు.