దేశ వ్యాప్తంగా 'మీ టూ' ప్రకంపనలు ఎప్పుడు ఎవరి పరువును బజారున పడేస్తాయో ఎవరి ఉద్యోగాన్ని పోగొట్టేస్తాయో తెలియని పరిస్థితి. షాజిద్‌ఖాన్‌లాంటి ప్రముఖ దర్శకుడే తనపై ఆరోపణలు రావడంతో 'హౌస్‌ఫుల్ 4' సినిమా దర్శకత్వం నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి బెట్టు చేస్తున్నా, కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ పదవి కూడా పోయేలానే ఉంది.
ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో ప్రముఖులు కొందరు ఈ 'మీ టూ' దెబ్బకి భీతిల్లుతున్నారు. ప్రొడక్షన్ హౌస్‌లో పని చేసేవాళ్లు, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో సహాయ సహకారాలు అందించేవాళ్లు, నటీ నటుల్ని కో ఆర్డినేట్ చేసేవాళ్లు.. ఇలా సినిమాకి సంబంధించి ప్రతీ విభాగం 'మీ టూ' దెబ్బకి షాక్ తినాల్సి వచ్చింది. కొందరు స్వచ్చందంగా సినిమాల్ని వదులుకుంటుంటే, ఇంకొందరు బలవంతంగా గెంటివేయబడుతున్నారు. హీరోలు, హీరోయిన్లు ఇతర నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఇలా ప్రతీ ఒక్కరూ ఆరోపణలు వచ్చిన వారిని నిర్మొహమాటంగా దూరం పెట్టేస్తున్నారు.
దాంతో బాలీవుడ్‌లో సినిమాల నిర్మాణం పడకేసే పరిస్థితికి వచ్చింది. సినీ రంగంలో ప్రక్షాళనకు ఇంతకు మించిన మంచి సమయం మళ్లీ దొరక్కపోవచ్చునేమోనని పలువురు అభిప్రాయపడుతుంటే, ఇంకొందరు మాత్రం సినిమా మీదే ఆధారపడి బతుకుతున్న వారికి ఈ సంక్షోభం తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసిందని అంటున్నారు.
అతి త్వరలో ఈ 'మీ టూ' తుఫాన్ దక్షిణాది సినీ పరిశ్రమని కుదిపేయనుంది. వారం, పది రోజుల హంగామా, ఓ పబ్లిసిటీ స్టంట్ అన్న తేలికపాటి అభిప్రాయాలకు కాలం చెల్లింది. 'మీ టూ' సునామీ భారతీయ సినీ పరిశ్రమని ముంచెత్తనుంది.