కేరళ వరదల్లో విలవిల్లాడుతోంది. పలువురు సెలబ్రిటీలు డబ్బుల రూపంలో విరాళాలు ప్రకటిస్తున్నారు. కొందరు స్వచ్చందంగా రంగంలోకి దిగి సాయమందిస్తున్నారు. మరికొందరు అభిమానుల ద్వారా సహాయక చర్యలు సజావుగా సాగేలా చేస్తున్నారు.
తాజాగా హీరోయిన్ అమలాపాల్ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. అయితే తనకు తోచిన విరాళాన్ని అందించకుండా, దగ్గరుండి సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించింది. రిలీఫ్ మెటీరియల్ క్యాంప్ దగ్గరకు స్వయంగా వెళ్లింది. దగ్గరుండి అక్కడి మెయింటెనెన్స్ వివరాలు తెలుసుకుంది. ఆవాసాలు కోల్పోయిన బాధితులతో కాసేపు ఊరటనిచ్చేలా మాట్లాడింది.
అయితే ఇటీవల షూటింగ్‌లో జరిగిన ఓ ప్రమాదం కారణంగా అమలాపాల్ చేతికి గాయం తగిలింది. ఆ చేతి గాయంతోనే ఆమె ఈ సేవాకార్యక్రమాల్లో పాల్గొంది. చేతికి కట్టుతో అమలాపాల్ కేరళ బాధితులను పరామర్శిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది చూసిన కొందరు నెటిజన్లు అమలాపాల్ సాహసానికి, సేవా దృక్పధానికి హ్యాట్సాఫ్ అంటుంటే, మరికొందరు నెటిజన్లు మాత్రం, ఈ ఇష్యూని అమలాపాల్ పబ్లిసిటీ కోసం బాగా వాడేస్తోందని కామెంట్ చేస్తున్నారు.