మలయాళంలో అమలాపాల్ స్టార్ హీరోయిన్. వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. తమిళంలోనూ ఓ మోస్తరు స్టార్‌డమ్ ఉంది ఆమెకు. తెలుగులో కూడా 'నాయక్' తదితర చిత్రాలతో సుపరిచితురాలే. అలాంటిది ఆమెపై ఈ మధ్య వస్తున్న విమర్శలు అమలాపాల్‌ని కలిచి వేస్తున్నాయట. 'ఆమె' సినిమా టీజర్‌తో అమలాపాల్ ఎంత సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అంత సెన్సేషన్ అయ్యాక, ఇంకోపక్క ఆమెపై వస్తున్న ఈ పుకార్లేంటో అర్ధం కావడం లేదు. చంద్రా ఆర్ట్స్ నిర్మాతలకూ, అమలాపాల్‌కీ మధ్య సైలెంట్ వార్ కాస్తా వైలెంట్‌గా మారబోతోంది. విజయసేతుపతి సినిమా నుండి అనూహ్యంగా అమలాపాల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడానికి తన పాత్రేమీ లేదనీ, నిర్మాతలే తనను అన్యాయంగా తప్పించారనీ అమలాపాల్ పదే పదే మొత్తుకుంటోంది. అమలాపాల్ ఏమంత చిన్న హీరోయిన్ కాదాయె. ఆమె తలచుకుంటే అవకాశాలకేమీ కొదవ లేదాయె. అలాంటిది ఈ ఒక్క అవకాశం కోల్పోయినందుకు ఆమె ఎందుకింత యాగీ చేస్తోందో అర్ధం కావడం లేదు.
అయితే, ఒక్క మాట. ఈ ప్రాజెక్ట్‌ని ఆమె ఎంతో ప్రెస్టీజియస్‌గా తీసుకుని ఉండి ఉండాలి. లేదంటే, నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు రూమర్లలో ఎంతో కొంత నిజమైనా ఉండి ఉండాలి. 'అడై' (తెలుగులో 'ఆమె') టీజర్ తర్వాత అమలాపాల్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దాన్ని క్యాష్ చేసుకోవాలనే క్రమంలో రెమ్యునరేషన్ పెంచాలని అమలాపాల్ భావించిందో ఏమో, అందుకు నిర్మాతలు వెనకడుగు వేసి ఉంటారు. దాన్ని కప్పి పుచ్చుకోవడానికేమైనా అమలాపాల్ ట్రై చేస్తోందా.? ఏమో నిజం నిలకడ మీదే తెలుస్తుంది. కానీ, ఈ లోగా అమలాపాల్ తీరు కాస్త ఓవర్‌గా అనిపిస్తోంది.