ఈవారం విడుదలైన అమర్ అక్బర్ ఆంటోనీ గట్టి షాకే ఇచ్చింది. సవ్యసాచి డిజాస్టర్ దెబ్బకు కళ్లు బైర్లు కమ్మిన మైత్రీకి ఇది మరో ఎదురుదెబ్బ. నిజానికి ఈ సినిమా రిజల్ట్ ఏంటన్నది నిర్మాతలకు ముందే తెలిసిపోయినట్టు అర్థమవుతోంది.
ఓ సినిమా డిజాస్టర్ అయితే ఆ సినిమాని కొన్న బయ్యర్లు తీవ్రస్థాయిలో నష్టపోతారు. అయితే... అమ్ముకున్న నిర్మాతలు వాళ్లకు సమాధానం చెప్పి తీరాలి. నష్టాల్లో కొంత భరించాలి. సవ్యసాచికీ అదే జరిగింది కదా? సవ్యసాచి కొని నష్టపోయిన బయ్యర్లు మా పరిస్థితేంటి? అంటూ మైత్రీ మూవీస్ దగ్గర మొర పెట్టుకున్నారు. అందుకే ఈసారి మళ్లీ అదే సీన్ రిపీట్ కాకుండా.. 'సవ్యసాచి' కొన్న బయ్యర్లకే మళ్లీ 'అమర్ అక్బర్ ఆంటోనీ' తక్కువ రేటుకే ఇచ్చేసింది మైత్రీ. ఓ విధంగా ఈ సినిమాని మైత్రీ మూవీస్ సొంతంగా విడుదల చేసినట్టు లెక్క.
'సవ్యసాచి' బయ్యర్లకు కేవలం అడ్వాన్సులు తీసుకుని 'అ.అ.ఆ' ఇచ్చేసింది. 'సవ్యసాచితో వచ్చిన నష్టాలు కవర్ చేసుకుని మిగిలిన సొమ్ము ఇవ్వండి చాలు' అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. నిజానికి 'అమర్..' హిట్టయితే.. 'సవ్యసాచి' బాకీలు తీరిపోయేవి. కానీ అది కూడా ఫ్లాప్ అయ్యింది. రెండో రోజే.. సగానికి పైగా థియేటర్లు ఖాళీ అయ్యాయి. ఈ సీన్ ముందే ఊహించిన మైత్రీ మూవీస్.. తమ బయ్యర్ల ముందరి కాళ్లకు బంధమేయగలిగింది.
''సవ్యసాచి లెక్కలన్నీ అమర్ అక్బర్‌తోనే సమాప్తం. లాభమొచ్చినా, నష్టమొచ్చినా భర్తీ చేసేది లేదు'' అని ముందే గట్టిగా చెప్పేశారట. దాంతో... బయ్యర్లు కూడా ఇప్పుడు కామ్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ రకంగా మైత్రీ తెలివైన నిర్ణయం తీసుకున్నట్టే లెక్క.