బాహుబలి తరవాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం `RRR`. రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులు. ఇటీవలే.. ఎన్టీఆర్, చరణ్ టీజర్లను విడుదల చేసి, ఈ సినిమా క్రేజ్ మరింత పెంచేశాడు రాజమౌళి. ఈ సినిమా గురించి బాలీవుడ్ కూడా ఆసక్తి గా ఎదురు చూస్తోంది. ఈసారి జక్కన్న ఏం మ్యాజిక్ చేశాడా? అంటూ ఆరా తీస్తోంది.
బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని మరింత దగ్గర చేయడానికి రాజమౌళి.. ఇద్దరు స్టార్ హీరోల సహాయం తీసుకోబోతున్నాడని టాక్. వాళ్లే అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్. హిందీ వెర్షన్ కి సంబంధించి ఎన్టీఆర్‌కి అమీర్ ఖాన్, చరణ్‌కి సల్మాన్ ఖాన్ డబ్బింగ్ చెప్పబోతున్నార్ట. చరణ్ - సల్మాన్ ఖాన్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇది వరకు సల్మాన్ హిందీ సినిమా తెలుగులో డబ్ అయినప్పుడు... సల్మాన్ పాత్రకు చరణే డబ్బింగ్ చెప్పాడు. సో.. చరణ్‌కి గొంతు ఇవ్వడానికి సల్మాన్‌కి ఎలాంటి అభ్యంతరం ఉండదు. రాజమౌళికీ అమీర్‌ఖాన్‌కీ మధ్య మంచి అనుబంధం ఉంది. రాజమౌళితో ఓ సినిమా చేయాలని అమీర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. మహాభారత్ ప్రతిపాదన తెచ్చింది కూడా అమీర్ ఖానే. కాబట్టి.. ఎన్టీఆర్‌కి అమీర్ డబ్బింగ్ చెప్పడం ఖాయం. అలా.. ఇద్దరు స్టార్ హీరోల సహాయం తీసుకుని, ఈ సినిమా క్రేజ్‌ని బాలీవుడ్ లో అమాంతం పెంచే పనిలో బిజీగా ఉన్నాడట రాజమౌళి.