'సైరా నరసింహారెడ్డి' సినిమాకి సంబంధించి ప్రతి విషయాన్నీ అత్యంత గోప్యంగా వుంచుతోంది ఆ సినిమా యూనిట్. చిరంజీవి నటిస్తోన్న 151వ సినిమా ఇది. దాదాపు తొమ్మిదేళ్ళ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి, ఆ తర్వాతి చిత్రంగా చేస్తోన్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేలా వున్నాయి.
చారిత్రక గాధ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో, ఈ సినిమాలో ప్రతి పాత్రా ప్రత్యేకమైనదే. ఇటీవలే సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఓ ఫొటో లీక్ అయ్యింది. అందులో చిరంజీవి గెటప్ చూచాయిగా కన్పిస్తోంది. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్న అమితాబ్ బచ్చన్ ఓ ఫొటోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. అయితే, అది 'సైరా నరసింహారెడ్డి' సినిమాలోని లుక్ కాదు, ఇంచుమించు ఇలా వుండబోతోంది.. అంటూ అభిమానుల్ని ఉద్దేశించి బిగ్-బి రిలీజ్ చేసిన లుక్ అది. అయితే, లుక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. 'ఇదే ఫైనల్ వెర్షన్' అని నెటిజన్లు దుష్ప్రచారం మొదలు పెట్టేశారు.
దీనిపై అమితాబ్ స్పందించాడు. 'ఇంచుమించు ఇలా వుండబోతోంది' అని చెప్పాననీ, ఇంకా గెటప్ ఫైనలైజ్ కాలేదనీ అమితాబ్ క్లారిటీ ఇచ్చినా గాసిప్స్ మాత్రం ఆగడంలేదు. చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని చాటుకుంటూ, కేవలం చిరంజీవి అడగడం వల్లే తెలుగు సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు ప్రకటించాడు బిగ్-బి. ఏదిఏమైనా, 'ఇలా వుండబోతోంది' అని ఓ డమ్మీ లుక్ పోస్ట్ చేసి, తన పాత్రపై కావాల్సినంత హీట్ పెంచేశాడన్నమాట అమితాబ్ బచ్చన్.