సినీ పరిశ్రమలోని మహిళలపై ఓ ఛానల్ యాంకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో టాలీవుడ్ భగ్గుమంటోంది. ఇప్పటికే పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు ఈ విషయంపై స్పందించారు, ఆ వివాదాస్పద వ్యాఖ్యల్ని ఖండించారు. 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) పోలీసులకు ఈ ఘటనపై పిర్యాదు కూడా చేసింది.
తాజాగా, యంగ్ హీరో నాని సోషల్ మీడియాలో ఈ వివాదాస్పద అంశంపై ఘాటుగా స్పందించాడు. 'పిల్లలు చూస్తున్నారు, ఇక చాలు.. ఆపండి' అంటూ యూ ట్యూబ్ ఛానళ్ళనీ, మీడియానీ అభ్యర్థిస్తూనే, కడిగి పారేశాడు. మీడియా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని నాని విజ్ఞప్తి చేశాడు. 'మనందరిపైనా బాధ్యత వుంది' అన్న విషయాన్ని నాని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. నిజమే, ఆ ఛానల్ యాంకర్ ఒక్కసారి ఆ 'వివాదాస్పద మాట' అన్నాడుగానీ, దాన్ని వందలసార్లు, వేలసార్లు ప్రసారం చేసేస్తున్నారు కొందరు. యూ ట్యూబ్‌లో అయితే ఆ పిచ్చి మాటలకి విపరీతమైన వ్యూస్ పడుతున్నాయి. ఇదొక విపరీతమైన ప్రపంచంలా తయారైంది.
ఇలాంటి వింత పోకడల ద్వారా సమాజంలో చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయనీ, పిల్లలపై ఆ ప్రభావం చాలా తీవ్రంగా వుంటుందన్న కఠోర వాస్తవాన్ని నేచురల్ స్టార్ నాని, నిర్మొహమాటంగా ప్రస్తావించాడు. నటుడు, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణమురళితో ఇంటర్వ్యూ సందర్భంగా ఓ ఛానల్ ప్రతినిథి హద్దులు దాటిన సంగతి తెల్సిందే. అదే ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువు.