అందాల తార అమైరా దస్తుర్ కూడా 'మీ టూ' క్లబ్‌లోకి చేరింది.
తనను ఓ హీరో, దర్శకుడు వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది. ఆ హీరో, ఆ దర్శకుడి పేర్లు చెప్పకపోయినా, వారి వల్ల తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని మాత్రం సవివరంగా పేర్కొంది. తనతో క్లోజ్‌గా మూవ్ అయ్యేందుకు వారు ప్రయత్నించారనీ, ఈ క్రమంలో వారికి తన నుంచి సానుకూల స్పందన లభించకపోవడంతో తనను వేధించడం మొదలు పెట్టారని ఆరోపించింది అమైరా దస్తుర్.
హిందీతోపాటు, తమిళ, తెలుగు భాషల్లో అమైరా దస్తుర్ పలు సినిమాల్లో నటించింది. దాంతో, ఆమెను ఇబ్బంది పెట్టిన ఆ దర్శకుడు, నటుడు ఎవరన్నది తెలియలేదు. ఆమె తెలుగులో నటించిన 'మనసుకు నచ్చింది' సినిమాకి దర్శకత్వం వహించింది ఓ మహిళ. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఈ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెల్సిందే. సందీప్ కిషన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఆమె నటించిన మరో సినిమా 'రాజుగాడు'. ఇందులో రాజ్ తరుణ్ హీరో. తమిళంలో చేసిన 'అనేగన్' సినిమా ఆమెకు నటిగా మంచి గుర్తింపునే ఇచ్చింది. ఆయా వ్యక్తుల వివరాలు చెప్పకుండా, తాను ఎదుర్కొన్న సమస్యల్ని వివరించిన అమైరా దస్తుర్, తాను చూసినంతవరకు తనకెక్కడా కాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురు కాలేదని చెప్పడం గమనించాల్సిన విషయం.
బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడాల్లేకుండా అన్ని సినీ పరిశ్రమలూ ఈ 'మీ టూ' క్యాంపెయిన్ ప్రకంపనలకు విలవిల్లాడుతున్నాయి. పలువురు సినీ ప్రముఖుల పేర్లను బాధిత మహిళలు తెరపైకి తెస్తున్నారు. ఆ లిస్ట్‌లో అమైరా కూడా చేరిందిగానీ, ఆమె ఎవరి పేర్లనూ బయటపెట్టలేదు.