'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ తర్వాత అనసూయ 'యాత్ర' సినిమాలో నటించింది. ఈ సినిమాలో అనసూయ ఓ కీలక పాత్ర పోషించనుందనీ, అది షర్మిల పాత్ర కానీ, లేదంటే, దివంగత వైఎస్సార్‌కి అత్యంత సన్నిహితురాలు చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి పాత్ర కానీ అయ్యుంటుందనీ భావించారు. అయితే లేటెస్టుగా వచ్చిన 'యాత్ర' ట్రైలర్‌లో అనసూయకు చోటు దక్కకపోవడంతో ఆమె పాత్రపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. సరికదా అసలింతకీ రంగమ్మత్త పాత్రేంటో అనే ఉత్కంఠకు తెర పడలేదింకా.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో మరో కీలక పాత్ర వైఎస్సార్ సతీమణి విజయమ్మ పాత్ర. ఆ పాత్రలో మలయాళ నటి ఆశ్రిత వేముగంటి నటిస్తున్నారు. ట్రైలర్‌తో పాటు, కొన్ని నిముషాల ముందే విజయమ్మ పాత్రలో ఆశ్రిత ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది. ఈ లుక్‌లో అచ్చు విజయమ్మలానే కనిపించింది ఆశ్రిత. హావభావాల్లో అచ్చు విజయమ్మనే తలపిస్తోంది. అంటే ఈ పాత్ర విషయంలో డైరెక్టర్ ఎంత దృష్టి పెట్టారో అర్ధం చేసుకోవచ్చు. ఇకపోతే అనసూయ పాత్రను డైరెక్టర్ ఎలా మలిచి ఉంటాడనేది తెలియాలంటే మరికొంత సమయం వెయిట్ చేయాలేమో.
ఇదిలా ఉంటే, మరోవైపు అనసూయ 'ఎఫ్ 2' చిత్రంలోనూ నటిస్తోంది. ఈ సినిమాలో కూడా అనసూయ పాత్ర ఇంకా రివీల్ కాలేదు. అయితే ఈ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్‌లో నటించనుందని క్లారిటీ ఉంది. లేటెస్టుగా విడుదలైన 'ఎఫ్ 2' ట్రైలర్‌లో కూడా అనసూయ కనిపించలేదు. ఇలా ఒకేసారి విడుదలైన 'యాత్ర', 'ఎఫ్ 2' రెండు ట్రైలర్స్‌లోనూ అనసూయకు చోటు దక్కకపోవడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు.