ఓ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ తీయడం సాధారణమైన విషయమే. అయితే.. కథ కుదరాలి. అన్ని సినిమాలూ సీక్వెల్స్ కి పనికిరావు. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం.. తన సినిమాలన్నింటికీ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 2కి సీక్వెల్ గా ఎఫ్ 3 తీస్తున్నాడు. రాజా ది గ్రేట్ సినిమాకి సీక్వెల్ చేయాలన్నది అనిల్ రావిపూడి ఆలోచన. ఆ సినిమా ఇంకా పెండింగ్ లో ఉంది.
ఇప్పుడు `సరిలేరు నీకెవ్వరు` సినిమాకీ సీక్వెల్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట. మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కి సరిపడా కథని అనిల్ రావిపూడి సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. `సరిలేరు నీకెవ్వరు` తరవాత.. అనిల్ రావిపూడితో మరో సినిమా చేయడానికి మహేష్ సైతం ఉత్సాహం చూపించాడు. కానీ సరైన కథ లేకపోవడం వల్ల కుదర్లేదు. ఇప్పుడు సరిలేరుకి సీక్వెల్ అంటే... మహేష్ ఏమంటాడో చూడాలి.