కరోనా వల్ల జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. చిత్రసీమ మరోసారి... డీలా పడింది. రిలీజులు ఆగిపోయాయి. షెడ్యూల్ మొత్తం చల్లాచెదురైంది. ఈ మేలో రావాల్సిన సినిమాలు జులై, ఆగస్టులకువాయిదా పడ్డాయి. ఆ ప్రభావం అన్ని సినిమాలపై పడింది. ఆఖరికి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ కూడా డిస్ట్రబ్ అయ్యింది. అక్టోబరు 13న ఈసినిమాని విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కరోనా వల్ల సినిమా షూటింగ్ ఎన్నిసార్లు వాయిదా పడినా... అక్టోబరు 13... దాటకూడదని గట్టిగా కృషి చేసింది.
అయితే.. సెకండ్ వేవ్ ఆ ఆశలపై నీళ్లు చల్లింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్టిలో ఉంచుకుని చూస్తే అక్టోబరు 13న ఈ సినిమా రావడం అసాధ్యం. కనీసం డిసెంబరులో అయినా విడుదల చేద్దామనుకున్నారు. కానీ... ఇప్పుడు 2021లో ఈ సినిమాని తీసుకురావడం కష్టమని తేల్చేశారు. ఆర్.ఆర్.ఆర్ విడుదల 2022 లోనే. అయితే అది సంక్రాంతికా? లేదంటే వేసవికా? అనేది తేలాల్సివుంది. వీలైనంత వరకూ 2022 సంక్రాంతికే విడుదల చేస్తారు. కాని పక్షంలో 2022 వేసవిలోనే చూడాలి.