ఆకాశంలో సగం అన్నింటా సగం అంటూ మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో పోటీపడి ముందుకు దూసుకెళ్తున్నారు. అయినా కానీ లైంగిక వేధింపులు, అత్యాచారాలు, అనుమానపు హత్యలు వంటి అకృత్యాలు మహిళలపై జరుగుతూనే ఉన్నాయి. తాజాగా స్త్రీ శక్తిని చాటే విధంగా ఓ చిత్రం తెరపైకి రాబోతోంది. మహిళా దినోత్సవం రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఐదుగురు మహిళల కథే ఈ చిత్రం.
ఓ సినీ నటి, ఓ సాధారణ గృహిణి ఇలా పలు రంగాలకు చెందిన ఐదుగురు మహిళలు తమ తమ రంగాల్లోని వేధింపులను తట్టుకోలేక, పరిస్థితులకు తలొగ్గి జీవనం సాగించలేక ఫ్రీడమ్ వెతుక్కుంటూ బయటపడతారు. అలా బయటపడిన ఆ మహిళలకు సమాజంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి.? చివరికి తాము కోరుకున్న ఫ్రీడమ్‌ని వారు దక్కించుకున్నారా.? తెలియాలంటే 'సీత ఆన్ ది రోడ్' సినిమా చూడాల్సిందే.
కల్పికా గణేష్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. 'పడి పడి లేచె మనసు' సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ క్యారెక్టర్ పోషించిన నటి ఈ కల్పికా గణేష్. ప్రణీత్ యారోన్ ఈ సినిమాకి దర్శకుడు. మరోవైపు మహిళలే ప్రధాన కాన్సెప్ట్‌గా మధుబాల, భాగ్యశ్రీ, సన, దీప్తి భట్నాగర్, హరితేజ తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందిన 'కిట్టీ పార్టీ' చిత్రం కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.