`ఘాజీ`ని చాలా పరిమిత బడ్జెట్‌లో తీశాడు సంకల్ప్ రెడ్డి. అప్పటికి తనపై ఎలాంటి నమ్మకాలూ లేవు కాబట్టి, అదో ప్రయోగాత్మక చిత్రం కాబట్టి... తక్కువ బడ్జెట్‌లో ఆ సినిమా తీయడమే న్యాయం. తొలి సినిమాతో సంకల్ప్‌రెడ్డిపై నమ్మకాలూ, అంచనాలూ పెరుగుతాయి. కాబట్టి బడ్జెట్ కాస్త అటూ ఇటూ అయినా.. సర్దుకుపోవొచ్చు. `అంతరిక్షం` రూ.12 కోట్లలో తీయాల్సిన సినిమా. చివరికి రూ.24 కోట్ల వరకూ అయ్యిందని చిత్రబృందమే చెప్పింది.
అయితే `అంతరిక్షం` చూస్తే.. అంత అయ్యుంటుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ సినిమా కొన్ని పరిమిత లొకేషన్లలో తెరకెక్కించేశారు. ద్వితీయార్థం మొత్తం అంతరిక్షంలోనే. దాదాపు ఒకే సెట్‌లో ఈ సినిమా సాగింది. సినిమా మొత్తంగా రెండు మూడు సెట్లు, ఆరేడు లొకేషన్లు కనిపిస్తాయి. భారీ తారాగణం కూడా ఏం లేదు.
వరుణ్ పారితోషికం రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకూ ఉంటుంది. పారితోషికాలకు 8 కోట్ల వరకూ అయ్యిందనుకుంటే.. మేకింగ్‌కి రూ.16 కోట్లు అయిపోతాయా? అనేది పెద్ద ప్రశ్న. సినిమా చూస్తుంటే.. రూ.10 నుంచి రూ.12 కోట్లలో పూర్తి చేసినట్టు అనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే... నిర్మాత మంచి లాభాలతోనే గట్టెక్కిపోయినట్టు. లేదంటే నిజంగానే రూ.24 కోట్లు పెడితే గనుక.. దానికి తగిన నాణ్యత సినిమాలో లేదనిపిస్తుంది. నిర్మాత ఆ డబ్బుల్ని రాబట్టుకోవడం కూడా కష్టమే.