ఈ వారం విడుదల అవుతున్న చిత్రాలలో 'పడి పడి లేచె మనసు' ప్రేమకథ అయితే - 'అంతరిక్షం' ఓ సైన్స్ ఫిక్షన్. ఓ రకంగా... ఇదో ప్రయోగాత్మక చిత్రం అనుకోవాలి. తెలుగులో వస్తున్న మొట్ట మొదటి స్పేస్ థ్రిల్లర్ సినిమా ఇది. అందుకే... సంకల్ప్ రెడ్డి ఎలా తీశాడో... అంటూ అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. అన్ని ఏరియాల్లో కలసి దాదాపు రూ.19 కోట్లకు అమ్ముడుపోయింది. నైజాం హక్కులు రూ.5 కోట్లకు అమ్మేశారు. ఓవర్సీస్ 3.5 కోట్లు పలికింది. సీడెడ్ లో రెండు కోట్ల వరకూ వచ్చాయి. శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ అన్నీ కలిపి రూ.9 కోట్లు పలికాయి. అంటే.. రూ.28 కోట్ల వరకూ బిజినెస్ జరిగిందన్నమాట.
అయితే చివరి క్షణంలో ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్ చేతులు ఎత్తేయడంతో... చిత్రబృందం షాక్‌కి గురైంది. ఇప్పటికిప్పుడు పంపిణీదారుడ్ని వెదుక్కోవడం కష్టం కాబట్టి.. ఆ ఏరియాలో సొంతంగా విడుదల చేసుకోవాల్సివస్తోంది. ఈ సినిమాపై రూ.25 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు టాక్. ఆలెక్కన చూసుకుంటే.. నిర్మాతలు కాస్త టెన్షన్‌లో ఉన్నట్టు అర్థమవుతోంది. సినిమా బాగా ఆడి, లాభాలొస్తే.. ఫర్వాలేదు. లేదంటే... స్వల్ప నష్టాలతో నిర్మాతలు ఊపిరి పీల్చుకోవాల్సివస్తుంది.