స్టార్‌డమ్ ఎప్పుడు ఎలా వస్తుందో ఎలా మాయమైపోతుందో ఎవ్వరూ ఊహించలేం. అలాగే 'మజ్ను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్ వరసగా చిన్న చిత్రాలు చేస్తూ ఓ మోస్తరు పాపులర్ అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్‌తో 'అజ్ఞాతవాసి' సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడంతో అమ్మడి స్టార్‌డమ్ ఎక్కడికో వెళ్లిపోయిందనుకున్నారంతా. కానీ సీను రివర్స్ అయిపోయింది.
ఆ సినిమా హిట్ అయ్యుంటే అనూ పరిస్థితి మరోలా ఉండేదిప్పుడు. కానీ అలా జరగకపోయేసరికి, సినిమా ఒప్పుకున్నప్పుడు వచ్చిన క్రేజ్ విడుదలయ్యాక మాయమైపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'నా పేరు సూర్య' కూడా అనూ ఇమ్మాన్యుయేల్‌ని ఆదుకోకపోవడంతో విమర్శలకు కేంద్రబిందువైంది. అయినా ఎలాంటి విమర్శలు, గాసిప్స్‌నీ తాను లెక్కచేయననీ గట్టిగా చెబుతోంది హాట్ ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్.
ప్రస్తుతం తెలుగులో అనూ చేస్తున్న సినిమాల సంగతి పక్కన పెడితే, తమిళంలో స్టార్ హీరో ధనుష్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. ఇది ఆమెకి బంపర్ ఛాన్సే అని చెప్పాలి. గతంలో విశాల్ సరసన 'తుప్పరివాలన్' చిత్రంలో నటించింది. 'డిటెక్టివ్' పేరుతో తెలుగులోనూ ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ పాత్రకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఇంపార్ట్‌న్స్ ఉన్న పాత్రలోనే ఇప్పుడు ధనుష్ సినిమాలో కనిపించబోతున్నానని చెబుతోంది. తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నాయట.
గతంలో తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న కారణంగా తమిళంలో మంచి మంచి అవకాశాలు చాలా వదిలుకోవల్సి వచ్చిందట.కానీ ఇప్పుడు అలా కాదు, వస్తున్న ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటానని చెబుతోంది అందాల అనూఇమ్మాన్యుయేల్.