చిరంజీవి కెరీర్‌లో టాప్ టెన్ సూపర్ హిట్ చిత్రాల్లో 'ముఠామేస్త్రి' ఖచ్చితంగా వుంటుంది. ఆ చిత్రాన్ని నిర్మించింది డి.శివప్రసాద్‌రెడ్డి. నాగార్జున కెరీర్‌లో చెప్పుకోదగ్గ చాలా చిత్రాలకు ఆయనే నిర్మాత. శివప్రసాద్‌రెడ్డి నిర్మాణంలో నాగార్జున సినిమా అంటే అది 'సూపర్ హిట్' అని అభిమానులు గట్టిగా నమ్మేవారు.
శివప్రసాద్‌రెడ్డి, నాగార్జున వేర్వేరు కాదు.. అని అభిమానులు విశ్వసించేవారు. 'అత్యంత సన్నిహితుడు' అని నాగార్జున పిలుచుకునే అతి కొద్ది మందిలో శివప్రసాద్ రెడ్డి ఒకరు. ఆయన గుండె పోటుతో మరణించడం నాగార్జునని తీవ్రంగా కలచివేసింది. సన్నిహితుడ్ని కోల్పోయానంటూ నాగ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నాగార్జున మాత్రమే కాదు, నాగచైతన్య, అఖిల్ కూడా శివప్రసాద్‌రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నాగార్జున, శివప్రసాద్ రెడ్డి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
మరోపక్క చిరంజీవి కూడా, తనతో 'ముఠామేస్త్రి' సినిమా నిర్మించిన శివప్రసాద్‌రెడ్డి తనకు అత్యంత ఆప్తుడంటూ సంతాప సందేశం పంపారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు చిరంజీవి పేర్కొన్నారు. పలువురు తెలుగు సినీ ప్రముఖులు శివప్రసాద్‌రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు. శివప్రసాద్ అంత్యక్రియల్లో అక్కినేని కుటుంబం నుంచి పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
అభిరుచిగల నిర్మాతగానే కాక, అందరికీ ఆప్తుడిగా శివప్రసాద్‌రెడ్డి తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. శివప్రసాద్‌రెడ్డి నేతృత్వంలోని కామాక్షి బ్యానర్ అంటే, తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర బ్యానర్లలో ఒకటిగా ఓ వెలుగు వెలిగింది.