అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వచ్చిన సినిమా `అనుభవించు రాజా`. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమాకి నెగిటీవ్ రివ్యూలొచ్చాయి. దాంతో చిత్రబృందం నిరుత్సాహ పడినప్పటికీ, తొలి రెండు రోజుల వసూళ్లూ కాస్త సంతృప్తి కరంగా ఉండడంతో.. దర్శక నిర్మాతలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. తొలి రోజు 54 లక్షలు, రెండో రోజు 40 లక్షలు షేర్ తెచ్చుకుంది ఈ సినిమా. మూడో రోజు కూడా దాదాపు 40 నుంచి 50 లక్షల షేర్ వచ్చినట్టు సమాచారం.
ఈమధ్య ఏకాలంలో ఏ చిన్న సినిమాకీ తొలి రెండు రోజుల్లో రూ.కోటి షేర్ రాలేదు. ఆ లెక్కన రాజా... గట్టెక్కినట్టే. నిజానికి ఈ సినిమా నాన్ థియేటరికల్ రైట్స్ రూపంలోనే లాభాలు సంపాదించేసింది. ఓటీటీ హక్కుల్ని ఆహా సొంతం చేసుకుంది. శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ రెండూ కలుపుకుంటే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ దక్కించుకున్నట్టే. థియేటరికల్ రైట్స్ బోనస్ అనుకోవాలి. అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా కావడం, పబ్లిసిటీ కాస్త గట్టిగా చేయడం, `అనుభవించు రాజా` టైటిల్ సాంగ్ జనంలోకి వెళ్లడంతో.. ఈమాత్రం వసూళ్లు రాబట్టగలిగింది.