అతని పేరు రాజు. బంగార్రాజు. ఊర్లో తనంత జల్సారాయుడు ఇంకోడు లేడు. కోడి పందాలు, పేకాట, అమ్మాయిలూ... ఇదే తన దినచర్య. `ఊర్లో మనంత పోటుగాడు ఇంకోడు లేడు` అన్నది తన ధీమా. ఇలా ఊర్లో విలాస పురుషుడిగా తిరిగిన రాజు.. పట్నంలో సెక్యురిటీ గార్డ్ అవతారం ఎత్తాల్సివచ్చింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే.. `అనుభవించు రాజా` చూడాల్సిందే. రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రీను గవిరెడ్డి దర్శకుడు. కాశీష్ ఖాన్ కథానాయిక. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తెరకెక్కించింది.
ఈనెల 26న విడుదల కానుంది. ఇప్పుడు ట్రైలర్ నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్లో డైలాగులు గట్టిగానే వినిపించాయి. ''రూపాయి పాపాయి లాంటిదిరా..దాన్ని పెంచి పెద్దది చేసుకోవాలిగానీ, ఎవడి చేతుల్లో పడితే వాడి చేతుల్లో పెట్టకూడదు'' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. బంగార్రాజు ఎంత విలాస పురుషుడో చెప్పడానికి... ''బంగారం గాడి మనసు సినిమాహాల్ లాంటిది.. వారానికో సినిమా వస్తుంటది.. పోతుంటది. ఏదీ పర్మెనెంట్ గా ఆడదిక్కడ..'' అనే డైలాగ్ కూడా ఆకట్టుకునేదే.
మొత్తానికి గోదారి ఎటకారం, అక్కడి వాతావరణం.. ఇవన్నీ కలర్‌ఫుల్ గా ట్రైలర్లో చూపించారు. అజయ్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు. ప్రెసిడెంట్ పోస్టుకి అజయ్, రాజ్‌తరుణ్ మధ్య గలాటాతో యాక్షన్ ఎపిసోడ్స్ కి స్కోప్ ఇచ్చినట్టైంది. చాలా కాలం నుంచి రాజ్ తరుణ్ కి హిట్లు లేవు. అయితే ఆ లోటుని ఈ సినిమా తీరుస్తుందేమో అన్న భరోసా.. ఈ ట్రైలర్ కలిగించింది.