తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్. తెలుగులో తనకి మంచి హిట్స్ కూడా ఉన్నాయి. పద్ధతైన పాత్రలకు అనుపమ మంచి ఛాయిస్. అయితే.. అనుపమ తెలుగు సినిమాల నుంచి తప్పుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. రాక్షసుడు తరవాత.. కొత్త సినిమాలేం ఒప్పుకోలేదు అనుపమ. ఈలోగా తమిళ, మలయాళ చిత్రాలు కొన్నింటిని ఒప్పుకుంది. తెలుగు నుంచి అవకాశాలొచ్చినా అనుపమ పెద్దగా స్పందించలేదని టాక్.
తనకు తెలుగులో మంచి పాత్రలు రావడం లేదని, పేరుకు మాత్రమే హీరోయిన్ అనిపించుకోవడం తనకు ఇష్టం లేదని, హీరోతో సమానమైన పాత్ర దొరికినప్పుడే తెలుగులో చేస్తానని అంటోందట అనుపమ. ఇప్పటి వరకూ అనుపమ చేసినవన్నీ అలాంటి పాత్రలే. కాకపోతే.. ప్రతీసారీ అలాంటి పాత్రలు దొరకడం కష్టం కదా. తెలుగులో మరింత కష్టం. ఈ విషయమే ఈ అమ్మడికి అర్థం కావడం లేదు. ఇలా వరుసగా సినిమాల్ని వదులుకుంటూ పోతే.. తెలుగు నిర్మాతలు, దర్శకులు అనుని లైట్ తీసుకునే ప్రమాదం ఉంది. అది ఇంకా ప్రమాదం. ఈ విషయాన్ని అను ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.